
న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్ రేసులో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్థనే ముందంజలో ఉన్నట్లు సమాచారం. టీమిండియా కోచ్ పదవిపై జయవర్థనే అత్యంత ఆసక్తిగా ఉన్నాడు. త్వరలోనే అతడు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి కొత్తగా వయసు, అనుభవం నిబంధనలు తీసుకొచ్చింది. అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అంతర్జాతీయ అనుభవంతో పాటు 60 ఏళ్ల వయసు మించరాదని పేర్కొంది.
ప్రధాన కోచ్ సహా బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌ను తిరిగి నియమించుకోనుంది. జులై 30, సాయంత్రం ఐదు గంటల్లోగా ఆయా పదవులకు దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ సూచించింది. ప్రస్తుతం కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు జయవర్థనేతో పాటు టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిరెస్టన్, టామ్ మూడీ, వీరేంద్ర సెహ్వాగ్‌లు ఆసక్తిగా ఉన్నారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు మహేలా జయవర్ధనే కోచ్‌గా ఎంపికైన తర్వాత జరిగిన మూడు ఎడిషన్లలో రెండుసార్లు ఆ జట్టు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. దీంతో పాటు ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలతో అతడికి మంచి సాన్నిహిత్యం ఉండటం కూడా కలిసొచ్చే అంశం. ప్రస్తుత హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌కు ప్రపంచకప్ ముగిసే నాటికి పదవీకాలం పూర్తయ్యింది. అయితే వెస్టిండీస్ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ వీరికి 45 రోజుల గడువును పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment