
జిబెట్ నవ్వింది
మహిళల స్టీపుల్‌చేజ్ స్వర్ణం బహ్రెయిన్ క్రీడాకారిణిదే లలితకు కాంస్యం, సుధా సింగ్‌కు నిరాశ
ఇంచియూన్: ఆసియా క్రీడల్లో శనివారం జరిగిన స్టీపుల్ చేజ్‌లో తొలి స్థానంలో నిలిచిన రూత్ జిబెట్ (బహ్రెయిన్)పై అనర్హత వేటు పడింది. దీంతో ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈ అంశంలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన భారత క్రీడాకారిణులు లలిత, సుధాసింగ్‌లకు... జిబెట్‌పై వేటు కారణంగా ఓ స్థానం మెరుగై రజత, కాంస్యాలు లభించింది. అయితే ఈ ఫలితంపై బహ్రెయిన్ అధికారులు తిరిగి విచారించాలని ఆసియా క్రీడల నిర్వాహకులకు అప్పీలు చేశారు. దీనిపై ముగ్గురు సభ్యుల జ్యూరీ విచారణ జరిపి... జిబెట్ తప్పు చేయలేదని ఆమెకే స్వర్ణం అని ప్రకటించారు. దీంతో ఆదివారం తిరిగి ఈ విభాగంలో పతకాలు ఇచ్చారు. ముసిముసి నవ్వులతో ఈ బహ్రెయిన్ క్రీడాకారిణి సగర్వంగా స్వర్ణం అందుకుంది. భారత క్రీడాకారిణి లలిత తిరిగి కాంస్య పతకానికి పడిపోగా... సుధాసింగ్‌కు నాలుగో స్థానంతో నిరాశ మిగిలింది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై భారత బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిని ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య దృష్టికి తీసుకెళతామని భారత చెఫ్ డి మిషన్ సమారివాల చెప్పారు.