జో రూట్ అరుదైన ఫీట్
మాంచెస్టర్:నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా పాకిస్తాన్తో ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరుగుతున్నరెండో మ్యాచ్లో ఇంగ్లండ్ టాపార్డర్ ఆటగాడు జో రూట్ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. తొలి రోజు సెంచరీతో మెరిసిన జోరూట్.. రెండో రోజు ఆటలో ద్విశతకాన్ని సాధించాడు. తద్వారా స్వదేశంలో పాకిస్తాన్పై డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచి అరుదైన ఫీట్ను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు 1954 లో ట్రెంట్ బ్రిడ్జ్ లో జరిగిన టెస్టులో డేనిస్ కాంప్టన్ ఒక్కడే పాక్ పై డబుల్ సెంచరీ సాధించాడు. దాదాపు ఆరు దశాబ్దాల తరువాత ఆ ఘనతకు జో రూట్ సాధించడం విశేషం. మరోవైపు ఓల్డ్ ట్రాఫోర్డ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో ఇంగ్లిష్ ఆటగాడిగా జో రూట్ నిలిచాడు.
ఈ మ్యాచ్లో కెప్టెన్ అలెస్టర్ కుక్ శతకానికి తోడు, జో రూట్ కూడా విశేషంగా రాణించడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 139.0 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి 513 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ ద్వారా ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ రెండో రికార్డులు సాధించిన సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు (11) చేసిన ఇంగ్లండ్ కెప్టెన్గా కుక్.. ఆ దేశ మాజీ క్రికెట్ కెప్టెన్ గ్రాహం గుచ్ రికార్డును సమం చేశాడు. 34 టెస్టుల్లో ఇంగ్లండ్కు సారథ్యం వహించిన గుచ్ 11 సెంచరీలు చేయగా, కుక్ 50 టెస్టుల్లో (కెప్టెన్గా) ఈ రికార్డును అందుకున్నాడు.ఓవరాల్ టెస్టు కెరీర్లో 29వ సెంచరీ చేసిన కుక్.. అత్యధిక సెంచరీలు చేసిన ఓవరాల్ బ్యాట్స్మెన్ జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్మన్ (29) సరసన లిచాడు. ఈ సిరీస్లో పాకిస్తాన్ తొలి టెస్టును గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది.