
ఇంగ్లండ్‌కు ‘రూట్’ దొరికింది!
సెంచరీతో చెలరేగిన జో రూట్
యాషెస్ తొలి రోజు ఇంగ్లండ్ 343/7
కార్డిఫ్: దాదాపు రెండేళ్ల క్రితం 0-5తో చిత్తుగా ఓడిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ తరఫున ఒకే ఒక్క సెంచరీ నమోదయింది. ఈసారి మాత్రం సొంతగడ్డపై యాషెస్ తొలి రోజే ఆ జట్టు ఖాతాలో శతకం చేరింది. ఇటీవల అద్భుత ఫామ్‌లో ఉన్న జో రూట్ (166 బంతుల్లో 134; 17 ఫోర్లు) తన అద్వితీయ ఆటతీరుతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఫలితంగా మొదటి టెస్టు తొలి రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. గ్యారీ బ్యాలెన్స్ (149 బంతుల్లో 61; 8 ఫోర్లు), స్టోక్స్ (78 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ప్రస్తుతం మొయిన్ అలీ (26 బ్యాటింగ్), బ్రాడ్ (0 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌ను ఆసీస్ బౌలర్లు కట్టడి చేశారు. దాంతో 43 పరుగులకే ఆ జట్టు లిత్ (6), కుక్ (20), బెల్ (1) వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రూట్, బ్యాలెన్స్ కలిసి ఆదుకున్నారు. ‘సున్నా’ వద్ద స్టార్క్ బౌలింగ్‌లో కీపర్ హాడిన్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన రూట్ ఆ తర్వాత బౌండరీలతో చెలరేగిపోయాడు. తన శైలికి భిన్నంగా దూకుడుగా ఆడిన రూట్ 118 బంతుల్లోనే కెరీర్‌లో ఏడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 77 ఏళ్ల తర్వాత యాషెస్ తొలి రోజు ఒక ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ శతకం సాధించడం విశేషం. నాలుగో వికెట్‌కు బ్యాలెన్స్‌తో 153 పరుగులు జోడించిన రూట్, ఐదో వికెట్‌కు స్టోక్స్‌తో 84 పరుగులు జోడించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హాజల్‌వుడ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.
యాషెస్‌కూ ఆరంభోత్సవం!
సాధారణంగా ఎలాంటి హంగామా లేకుండా నేరుగా మ్యాచ్ మొదలయిపోయే యాషెస్ సిరీస్‌లో ఈ సారి కొత్తగా ప్రారంభోత్సవ వేడుకలు కూడా జరిగాయి. 1882-83 నాటి యాషెస్ వేడుకలను గుర్తు చేస్తూ ఈ సంబరం సాగింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల జాతీయ గీతాలాపన, బ్యాండ్ ట్రూప్ మెడ్లీ, బాణాసంచా...ఇలా అంతా కొత్తగా కనిపించింది.