
క్రికెట్‌కు జాన్సన్ గుడ్‌బై
అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగిన పేసర్
ఆసీస్ ఆల్‌టైమ్ టెస్టు వికెట్ల జాబితాలో నాలుగో స్థానం
పెర్త్: ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. న్యూజిలాండ్‌తో మంగళవారం ముగిసిన రెండో టెస్టు తర్వాత అతను రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించాడు. ఐదో రోజు ఆటకు ముందే రిటైర్మెంట్ అంశం గురించి ఓ ప్రకటన విడుదల చేసిన పేసర్... క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడానికి ఇదే మంచి సమయని పేర్కొన్నాడు. ‘ఇదో అద్భుతమైన ప్రయాణం. కానీ ఏ ప్రయాణమైనా ఏదో ఓ దగ్గర ముగియాల్సిందే. వాకా మైదానం నాకు చాలా ప్రత్యేకమైంది. రిటైర్మెంట్ నిర్ణయం తీసుకునేందుకు చాలా ఆలోచనలు చేశా. ఈ మ్యాచ్ తర్వాత పోటీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తానో లేదో తెలియదు. బ్యాగీ గ్రీన్ క్యాప్‌ను ధరించే సత్తా నాలో ఉందో లేదోనన్న సందేహం కలుగుతోంది. అందుకే వీడ్కోలు వైపు మొగ్గాను’ అని మ్యాచ్ అనంతరం 34 ఏళ్ల జాన్సన్ ఉద్వేగంగా వ్యాఖ్యానించాడు.
2001లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో మొదలు: క్వీన్స్‌లాండ్ తరఫున 2001లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడిన జాన్సన్... 2007లో ఆసీస్ తరఫున తొలి టెస్టు ఆడాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు మారిన తర్వాత పేసర్ బౌలింగ్‌లో సంచలనాలు సృష్టించాడు. 2008లో వాకా మైదానంలోనే దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (8/61) నమోదు చేశాడు.73 టెస్టుల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన జాన్సన్ 28.40 సగటుతో 313 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ తరఫున ‘ఆల్‌టైమ్ టెస్టు వికెట్ల జాబితా’ లో నాలుగో స్థానం దక్కించుకున్నాడు. లిల్లీ (355), మెక్‌గ్రాత్ (563), వార్న్ (708) ఇతనికంటే ముందున్నారు.
గాయాలతో దెబ్బ: కెరీర్ ఆరంభంలో ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన జాన్సన్... తర్వాత పూర్తిస్థాయిలో ప్రధాన పేసర్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. డెన్నిస్ లిల్లీని మెంటార్‌గా భావించే అతను లెఫ్టార్మ్ పేసర్‌గా కంగారూలకు ఎన్నో విజయాలు అందించాడు. తన దూకుడైన బౌలింగ్‌తో ఆరంభంలో లేదంటే చివర్లో వికెట్లు తీయడంలో జాన్సన్ సిద్ధహస్తుడు. ఎలాంటి ప్రత్యర్థి అయినా తనదైన ముద్ర కచ్చితంగా చూపే జాన్సన్.. భారత బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేసేందుకు కాస్త ఇబ్బందులుపడేవాడు. అయితే గత రెండేళ్లుగా అతను గాయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. 2013-14 సీజన్‌లో యాషెస్ సిరీస్‌ను ఆసీస్‌కు 5-0తో అందించిన జాన్సన్ ఆ తర్వాతి నుంచి ప్రాభవం కోల్పోయాడు. అదే సమయంలో జట్టులోకి వచ్చిన కుర్రాళ్లు కుదురుకోవడంతో భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. స్టార్క్ బౌలింగ్ శైలి జాన్సన్‌ను పోలి ఉండటం, పేస్‌లో అతను నిలకడను చూపడంతో కివీస్‌తో ముగిసిన రెండో టెస్టు తర్వాత జట్టులో చోటు దక్కడం కష్టమైంది. దీంతో వారం రోజులుగా రిటైర్మెంట్ గురించి యోచిస్తున్న జాన్సన్ దాన్ని కార్యాచరణలో పెట్టేశాడు.
‘జాన్సన్ ప్రత్యేకమైన బౌలర్. ముంబై ఇండియన్స్ తరఫున దీన్ని చూశా. అతని బౌలింగ్ దూకుడును బాగా అస్వాదించా. జాన్సన్ భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నా’. -సచిన్