విరాట్ కోహ్లికి కష్టాలు
ఈ సారికి వదిలేద్దామన్న ఠాకూర్
పెర్త్/న్యూఢిల్లీ: భారత క్రికెటర్ విరాట్ కోహ్లి, తమ విలేకరితో వ్యవహరించిన తీరు పట్ల జాతీయ ఆంగ్ల దిన పత్రిక ‘హిందూస్తాన్ టైమ్స్’ ఆగ్రహంతో ఉంది. కోహ్లి పరోక్ష క్షమాపణతో దీనిని వదిలి పెట్టరాదని ఆ సంస్థ నిర్ణయించింది. అందుకే కోహ్లి వ్యవహార శైలిపై బీసీసీఐ, ఐసీసీలకి అధికారికంగా ఫిర్యాదు చేసింది.
‘బోర్డు అధ్యక్షుడు దాల్మియాకు మేం ఫిర్యాదు చేశాం. ఆయన ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. అదే విధంగా మా రిపోర్టర్ కూడా పెర్త్‌లో ఐసీసీ సీఈ డేవ్ రిచర్డ్సన్‌కు ఫిర్యాదు చేశాడు’ అని పత్రిక క్రీడా సంపాదకులు వెల్లడించారు. మంగళవారం ప్రాక్టీస్ అనంతరం తనపై వ్యతిరేక వార్తలు రాశాడనే కారణంగా ఒక జర్నలిస్ట్‌పై ఆగ్రహంతో ఉన్న కోహ్లి... పొరపాటున మరో విలేకరిని బూతులు తిట్టిన సంగతి తెలిసిందే.
అలా అనలేదు: మేనేజ్‌మెంట్
మరో వైపు విలేకరిని కోహ్లి తిట్టినట్లుగా వచ్చిన వార్తలను ఖండిస్తూ భారత టీమ్ మేనేజ్‌మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఈ విషయంలో కొంత అపార్థం చోటు చేసుకుంది. కోహ్లి ఎలాంటి అభ్యంతరకర భాష వాడలేదు. ఆ విలేకరితో కోహ్లి మాట్లాడాడు. వివాదం ముగిసిపోయింది’ అని పేర్కొన్నారు. ఆటగాళ్లందరి దృష్టీ ప్రపంచకప్‌పైనే ఉన్నందున మిగతా విషయాలన్నీప్రస్తుతానికి పక్కన పెట్టాలని బీసీసీఐ కొత్త కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అన్నారు.