ఆసీస్ను కుమ్మేస్తున్నారు!
పెర్త్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా భారీ ఆధిక్యం సాధించింది. 104/2 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా జట్టులో జేపీ డుమినీ(141; 225 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్స్) భారీ శతకంతో మెరిశాడు. మరోవైపు ఓపెనర్ డీన్ ఎల్గర్ కూడా సెంచరీ సాధించడంతో దక్షిణాఫ్రికా టీ విరామానికి మూడు వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. డుమినీ-ఎల్గర్ల జోడి ఆస్ట్రేలియా బౌలర్లను కుమ్మేసి మూడో వికెట్ కు 250 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని సాధించింది. ఈ భాగస్వామ్యం ఆస్ట్రేలియాలో ఆ జట్టుపై దక్షిణాఫ్రికన్లు నమోదు చేసిన రెండో అత్యుత్తమ భాగస్వామ్యంగా నమోదైంది.
దాంతో దక్షిణాఫ్రికా ప్రస్తుతం 293 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో సఫారీలు 242 పరుగులకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్లో 244 పరుగులు చేసింది. కేవలం తొలి రోజు ఆటలో మాత్రమే ఆసీస్ పైచేయి సాధించగా, రెండు, మూడు రోజు ఆటలో దక్షిణాఫ్రికా తన హవా కొనసాగిస్తోంది.