'కోహ్లీ నా దెబ్బకు నిలబడలేడు'
కరాచీ: భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన బౌలింగ్ ధాటికి నిలబడలేడని పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ జునైద్ ఖాన్ అన్నాడు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో జునైద్ పై విధంగా స్పందించాడు. కోహ్లీ తనను ఎదుర్కొన్న నాలుగు మ్యాచ్‌ల్లో మూడుసార్లు ఔటైన విషయాన్ని ప్రస్తావించాడు.
చాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇదే రిపీట్ అవుతుందని చెప్పాడు. 'వాస్తవానికి కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మనే.. కానీ, నా వద్దకు వచ్చే సరికి అతని ఎత్తులు పారడం లేదు' అని అన్నాడు. కోహ్లీ కంటే తాను మానసికంగా బలంగా ఉన్నానని చెప్పాడు. కాగా, కోహ్లీ, జునైద్‌ను ఎదుర్కొని నాలుగు సంవత్సరాలు అవుతోంది. ఎడమ చేతి వాటం గల ఈ పేసర్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.