న్యూఢిల్లీ: భారత అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ రేసులోకి తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ, భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్, భారత మహిళా టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బత్రా వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సురేఖ పేరును... హాకీ ఇండియా (హెచ్‌ఐ) రాణి పేరును... టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్‌ఐ) మనిక బత్రాను నామినేట్ చేశాయి. క్రీడా అవార్డుల నామినేషన్లకు గడువు నేటితో ముగియనుంది. విజయవాడకు చెందిన 23 ఏళ్ల సురేఖకు 2017లో ‘అర్జున’ అవార్డు లభించింది. తన పదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో సురేఖ ప్రపంచ, ఆసియా చాంపియన్‌షిప్, వరల్డ్‌కప్‌లలో కలిపి 33 పతకాలను సాధించింది.
హాకీ నుంచి ‘అర్జున’ కోసం వందన కటారియా, మోనిక, హర్మన్‌ప్రీత్ సింగ్‌లను హెచ్‌ఐ సిఫారసు చేసింది. ‘ఖేల్‌రత్న’ పురస్కారానికి గడిచిన నాలుగేళ్ల ప్రదర్శనను పరిగణిస్తారు. జనవరి 1, 2016 నుంచి డిసెంబర్ 31, 2019 వరకు ఆటగాళ్ల ప్రతిభను అవార్డుల కమిటీ పరిశీలిస్తుంది. రాణి రాంపాల్ 2017లో మహిళల ఆసియా కప్ విజయంలో, 2018 ఆసియా క్రీడల్లో రజతం గెలిచేందుకు కీలకపాత్ర పోషించింది. టోక్యో ఒలింపిక్స్‌కు జట్టు అర్హత పొందడంలో రాణి పాత్ర ఎంతో ఉంది. ఆమె ఇదివరకే 2016లో అర్జున, ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాల్ని అందుకుంది. టేబుల్ టెన్నిస్‌లో మనిక బత్రా కూడా నిలకడగా రాణిస్తోంది. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో ఆమె 2 స్వర్ణాలు సహా 4 పతకాలు గెలిచింది. మధురిక, మానవ్ ఠక్కర్, సుతీర్థ ముఖర్జీలను ‘అర్జున’కు టీటీఎఫ్‌ఐ సిఫారసు చేసింది.
‘అర్జున’కు సాత్విక్...
మరోవైపు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, సమీర్ వర్మ పేర్లను ‘అర్జున’కు ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్ తన భాగస్వామి చిరాగ్‌తో కలిసి గతేడాది థాయ్‌లాండ్ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్ గెలిచాడు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో టీమ్ విభాగంలో స్వర్ణం, డబుల్స్‌లో రజతం సాధించారు. ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం హైదరాబాద్‌కు చెందిన ‘సాయ్’ కోచ్ భాస్కర్ బాబుతోపాటు ఎస్.మురళీధరన్ (కేరళ) పేర్లను సిఫారసు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment