సురేఖ ‘బంగారు’ గురి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ జ్యోతి సురేఖ మరోసారి సత్తా చాటింది. కొంతకాలంగా నిలకడైన విజయాలతో దూసుకుపోతున్న ఈ విజయవాడ అమ్మాయి తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. ఆది వారం న్యూఢిల్లీలో జరిగిన జాతీయ సీనియర్ ర్యాంకింగ్ ఫైనల్స్‌లో సురేఖ స్వర్ణం గెలుచుకుంది. దేశవ్యాప్తంగా టాప్-8 ఆర్చర్లు మాత్రమే పోటీ పడిన ఈ నాకౌట్ ఈవెంట్‌లో ఆమె విజేతగా నిలవడం విశేషం. కాంపౌండ్ విభాగం ఫైనల్లో సురేఖ 143-141తో లిల్లీ చామ్ (మణిపూర్)పై నెగ్గింది.
ఆమె క్వార్టర్ ఫైనల్లో 146-138 స్కోరుతో జయలక్ష్మి (మహారాష్ట్ర)ను, సెమీఫైనల్లో 143-133 తేడాతో మంజుథ (రైల్వేస్)ను ఓడించింది. 2013లో హైదరాబాద్, జంషెడ్‌పూర్, న్యూఢిల్లీ, ఔరంగాబాద్‌లలో జరిగిన నాలుగు జాతీయ ర్యాంకింగ్ టోర్నీల్లో ప్రదర్శన ఆధారంగా ఈ ఎనిమిది మందిని ఎంపిక చేశారు. ఆ నాలుగు టోర్నీల్లో మొత్తం పాయింట్లు కలిపి అగ్ర స్థానంలో నిలిచిన సురేఖ, తన జోరును కొనసాగిస్తూ ఇక్కడా విజేతగా నిలవడం విశేషం.