ఒలింపిక్స్‌లో కబడ్డీని చూడాలని ఉంది
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఇంటర్వ్యూ
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు గ్రామీణ క్రీడగా గుర్తింపు పొందిన కబడ్డీ నేడు అంతర్జాతీయస్థాయికి ఎదిగింది. గతేడాది ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభంతో ఈ ఆటకు ఆదరణ అమాంతం పెరిగింది. ఆసియా క్రీడల సమయంలో మాత్రమే మదిలో మెదిలే భారత కబడ్డీ క్రీడాకారులు ప్రొ కబడ్డీ లీగ్‌తో అందరి దృష్టిలో పడ్డారు. పలువురు సెలబ్రిటీలు ఈ క్రీడలో భాగస్వామ్యం కావడంతో తొలి ఏడాది ప్రొ కబడ్డీ లీగ్ విజయవంతమైంది. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ యజమానిగా ఉన్న జైపూర్ పింక్ పాంథర్స్ చాంపియన్‌గా నిలిచింది. ఈనెల 18న రెండో సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో ప్రొ కబడ్డీ లీగ్‌పై, కబడ్డీ క్రీడపై అమితాబ్ బచ్చన్ ఇంటర్వ్యూ.
భారత గ్రామీణ క్రీడ అంతర్జాతీయస్థాయికి చేరుకోవడంపై మీ స్పందన?
ప్రొ కబడ్డీ లీగ్ అనేది గొప్ప ఆవిష్కరణ. స్టార్‌స్పోర్ట్స్ సంస్థ తమ ప్రసారాల ద్వారా ప్రేక్షకులకు ఈ లీగ్, ఆట మరింత చేరువయ్యేలా చేసింది. ఈ లీగ్‌తో ఎంతోమంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. దేశీయ అభిమానులకు ఈ లీగ్ వినోదాన్ని పంచింది.
నాటికి, నేటికి కబడ్డీలో వచ్చిన తేడా ఏమిటి?
ఒకప్పుడు కబడ్డీని సాయంత్రం వేళల్లో సరదాగా మిత్రులతో కలిసి ఆడే వారు. ఇప్పుడు అంతా మారి పోయింది. ఈ క్రీడ కోసం సంఘాలు, సమాఖ్యలు ఏర్పాటయ్యాయి. ఆటకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. మున్ముందు కబడ్డీ కీర్తి విశ్వవ్యాప్తం కావాలని, ఒలింపిక్స్ క్రీడల్లో కబడ్డీ కనిపించాలని నా ఆకాంక్ష.
క్రికెట్‌తో పోలిస్తే కబడ్డీని మీరెలా ఆస్వాదిస్తున్నారు? మీరెపుడైన కబడ్డీ ఆడారా?
నేను ప్రతి క్రీడను ఇష్టపడతాను. ప్రతి దాంట్లో ఏదో ప్రత్యేకత ఉంటుంది. అది క్రికెట్‌గానీ, కబడ్డీ, టెన్నిస్, రెజ్లింగ్, టీటీ, బ్యాడ్మిం టన్ ఇలా దేనికవే ప్రత్యేకం. అలహాబాద్‌లో చిన్నపుడు చాలాసార్లు కబడ్డీని ఆడాను. మనందరిలో ఈ క్రీడ భాగమైపోయింది.
వర్ధమాన కబడ్డీ క్రీడాకారులకు మీరిచ్చే సలహా?
విజయం గురించే ఆలోచించండి. ప్రొ కబడ్డీ లీగ్ కారణంగాపెద్దగా గుర్తింపు లేని క్రీడాకారులు కూడా వెలుగులోకి వచ్చారు. నా తనయుడు అభిషేక్ బచ్చన్ యజమానిగా ఉన్న జైపూర్ పింక్ పాంథర్స్ గతేడాది విజేతగా నిలిచింది. ఈ ఏడాది కూడా ఆ జట్టు బాగా ఆడాలని కోరుకుంటున్నాను.