ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభ వేడుకలలో పాల్గొన్న సచిన్, అమీర్ ఖాన్, షారూక్ ఖాన్, అమితాబ్, ఐశ్వర్య, అభిషేక్
అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, జయబాదురి, సచిన్ టెండూల్కర్, అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్... మన దేశంలో వీరిని మించిన సెలబ్రిటీలు ఎవరు ఉంటారు? వీరందరూ ఒక వేదిక మీదకు వస్తే అభిమానులకు కన్నుల పండుగే. ఈ బిగ్షాట్స్ అందరినీ ఓ ఆట ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. అదే కబడ్డీ ఆట. ఇది మన ఆటే. ఈ నేలపైనే పుట్టింది. ఇది ఈనాటి ఆట కాదు. భారతీయ నాగరికత ఆవర్భవించిన కాలం నుంచి ఈ ఆట మూలాలు ఉన్నాయి. ఆ తరువాత ప్రపంచ స్థాయికి ఎదిగింది. అయిన ఈ ఆటపై మనవారికి అంతగా ఆసక్తి ఉండదు. మనవారికి క్రికెట్ తప్ప ఇతర ఆటలేవీ అంతగా కనిపించవు. ఈ పరిస్థితులలో మార్పు తీసుకురావలన్న ఉద్దేశంతో చాలా రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్రికెట్‌కు ఐపీఎల్ ఉన్నట్లు ఇతర ఆటలకు కూడా లీగ్స్ పెడుతున్నారు. దేశీయ ఆట అయిన కబడ్డీకి కూడా ఒక లీగ్ ఇప్పుడు నడుస్తోంది. అందులో భాగంగా ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభ వేడుకలకు ఈ ప్రముఖులు అందరూ హాజరయ్యారు.
ఇటీవల ముంబాయిలో జరిగిన ఈ లీగ్ ప్రారంభం అదరగొట్టింది. మొత్తం 8 టీములు ఆడుతున్న ప్రొ కబడ్డీ లీగ్‌లో ఒక టీమును అభిషేక్ బచ్చన్ కొన్నారు. భారీ స్థాయిలో సెలబ్రిటీలంతా ఓపెనింగ్ మ్యాచ్‌కు హాజరు కావడానికి ఇదే ప్రధాన కారణం. కారణం ఏదైనా మన గడ్డ మీద పుట్టిన కబడ్డీ ఆటకు ఈ స్థాయి ప్రాధాన్యత రావడం మనందరికీ సంతోషం కలిగించే విషయం.
ఇండియన్ క్రికెట్ లీగ్(ఐపిఎల్) ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ స్పూర్తితో మన పారిశ్రామికవేత్తల దృష్టి ఇతర ఆటలపై పడింది. బ్యాడ్మంటన్, కబడ్డీ, హాకీ, టెన్నిస్, ఫుట్‌బాల్ లీగ్‌లను కూడా జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కబడ్డీలో ఏర్పాటు చేసిన లీగ్ పేరు ప్రొకబడ్డీ లీగ్(పికెఎల్). ప్రొకబడ్టి లీగ్ ప్రారంభంలో 8 నగరాల్లో టీములను ఏర్పాటు చేశారు. ఇవి కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, పాట్నా, పూణే, వైజాగ్, ముంబాయి. జైపూర్ పింక్ పాంథర్స్ టీమును అభిషేక్ బచ్చన్ కొనుగోలు చేశారు. కోల్‌కతా టీము అయిన బెంగాల్ వారియర్స్‌ను బిగ్ బజార్ ఓనర్ కిషోర్ బియానీ ఫ్యూచర్ గ్రూపు కొనుగోలు చేసింది. వైజాగ్ టీము అయిన తెలుగు టైటాన్స్‌ను కోర్ గ్రీన్ గ్రూపు, శ్రీనివాస్ శ్రీరామనేని సంయుక్తంగా కొనుగోలు చేశారు.
ప్రొకబడ్డీ లీగ్‌లో ఆడేందుకు మన దేశంలో ఆటగాళ్లనే కాకుండా వివిధ దేశాలకు చెందిన వారిని కూడా వేలంలో కొనుక్కుకున్నారు. వేలంలో ఇండియన్ కబడ్డీ కెప్టెన్ రాకేష్ కుమార్ అత్యధికంగా 12 లక్షల 80 వేల రూపాయలు పలికారు. రాకేష్‌ను పాట్నా పైరేట్స్ దక్కించుకుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్లేయర్ దీపక్ నివాస్‌ను వైజాగ్ టీము తెలుగు టైటాన్స్ 12 లక్షల 60 వేల రూపాయలకు కొనుగోలు చేసింది. ప్రొకబడ్డీ మ్యాచ్‌లను స్టార్‌స్పోర్ట్స్ ప్రసారం చేస్తోంది. ప్రైమ్ టైమ్‌లో మ్యాచ్‌లను ఇస్తుండటం వల్ల ఎక్కువ మంది ప్రేక్షకులు చూడటానికి అవకాశం ఏర్పడుతుందని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జులై ఆఖరు నుంచి ఆగస్టు చివరి దాకా ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. సెమీ ఫైనల్స్, ఫైనల్స్ బెంగళూరులో జరుగుతాయి. విజేతగా నిలిచిన టీముకు 50 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు. రన్నరప్‌గా నిలిచిన టీముకు పాతిక లక్షలు, సెమీఫైనల్‌కు మిగిలిన రెండు టీములకు పన్నెండున్నర లక్షల రూపాయల చొప్పున నగదు బహుమతి అందిస్తారు. స్వదేశీ ఆట కబడ్డీకి మళ్లీ ప్రజాదరణ తెప్పించేందుకు ఈ స్థాయిలో ప్రయత్నాలు జరగడం సంతోషకరమైన విషయం. ఈ ప్రయత్నం ఫలించి కబడ్డీకి క్రికెట్ స్థాయిలో ఆదరణ లభించాలని ఆశిద్ధాం.
- శిసూర్య