
ప్రపంచకప్ కబడ్డీ: భారత్ బోణీ
అహ్మదాబాద్: ప్రపంచకప్ కబడ్డీ ప్రారంభ మ్యాచ్‌లోనే పసికూన కొరియా చేతిలో కంగుతిన్న భారత కబడ్డీ జట్టు రెండో మ్యాచ్‌లో సత్తా చాటింది. తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శిస్తూ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అనూప్ కుమార్ సేన 54-20 తేడాతో దుమ్ము రేపింది. దీపక్ నివాస్ హూడా, మంజిత్ ఛిల్లార్, పర్‌దీప్ నర్వాల్ విశేషంగా రాణిం చారు.
ఇక ఈ మ్యాచ్‌లో ఏమాత్రం పోటీనివ్వలేకపోయిన ఆసీస్ తొలి 11 నిమిషాల్లోనే రెండు సార్లు ఆలౌట్ అయింది. ఇదే ఊపులో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ 32-7 తేడాతో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. ఆ తర్వాత కూడా ఆసీస్ ఆటతీరులో ఏమాత్రం మార్పు లేకపోవడంతో భారత్ అలవోకగా విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 52-18తో ఇంగ్లండ్‌పై విజయం సాధిం చింది. ఈనెల 11న జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ ఆడుతుంది.