
మాస్కో: ప్రపంచ కప్ ఆడే అవకాశం రావడమంటేనే గొప్ప ఘనత. అలాంటిది ఫైనల్ వరకు వెళ్లిన, అదృష్టం కలిసొస్తే విశ్వవిజేతగా కూడా నిలిచే జట్టులో భాగంగా ఉండి కూడా చేజేతులా దానిని పోగొట్టుకుంటే అతడిని ఏమంటారు? ఆ దురదృష్టం పేరు నికొలా కలినిక్. క్రొయేషియా తరఫున 41 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఈ ఫార్వర్డ్ 23 మంది సభ్యుల ఫుట్‌బాల్ వరల్డ్ కప్ టీమ్‌లో సభ్యుడిగా రష్యాకు వచ్చాడు. అయితే కాస్త పొగరు, మరికాస్త ఆవేశం కలగలిసి జట్టుకు దూరమయ్యాడు.
టోర్నీలో భాగంగా నైజీరియాతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో తొలి 11 మందిలో అతను లేడు. అయితే మ్యాచ్ మధ్యలో కలినిక్‌ను సబ్‌స్టిట్యూట్‌గా వెళ్లమని కోచ్ జ్లాటో డాలిక్ ఆదేశించాడు. అయితే తన స్థాయికి సబ్‌స్టిట్యూట్‌గా వెళ్లడం నామోషీ అంటూ అతను తిరస్కరించాడు. దాంతో చిర్రెత్తిన కోచ్ తర్వాతి రోజే కలినిక్‌ను ఇంటికి పంపించేశాడు. కాస్త ఓపిగ్గా ఉంటే నేడు జట్టు సంబరాల్లో భాగం కావాల్సినవాడు తన సహచరుల ఫైనల్‌ను టీవీలో చూడాల్సి వస్తోంది. ‘మీరెప్పుడూ కలినిక్‌లా చేయవద్దు’ అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు వ్యంగ్య వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment