
టీమిండియా సీనియర్ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని కెరీర్‌పై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచప్‌లో ఓటమి తరువాత అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న మహీ.. అప్పటి నుంచి మైదానంలో కనిపించలేదు. ఇటీవల బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టుల్లోనూ మాజీ కెప్టెన్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని భవితవ్యంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. మహేంద్రుడు ఇక ఆటకు గుడ్‌బై చెప్పినట్లే అని సోషల్ మీడియా కోడైకూస్తోంది. ఈ క్రమంలోనే ధోని భవిష్యత్తుపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగానూ మారాయి. ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన నమోదు చేయకపోతే అంతర్జాతీయ క్రికెట్ నుంచి స్వయంగా తప్పుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా టీమిండియా దిగ్గజ ఆటగాడు, మాజీ సారథి కపిల్ దేవ్ ధోని భవిష్యత్తుపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. (ధోని భవితవ్యంపై రవిశాస్త్రి)
సోమవారం ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రపంచకప్ తరువాత ధోని మళ్లీ మైదానంలో కనిపించలేదు. దాదాపు ఆరునెలల సమయం ఆటకు దూరంగా ఉంటే.. మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం అంత సాధారణమైన విషయం కాదు. అయితే ధోనికి ముందు ఐపీఎల్ రూపంలో మంచి అవకాశం ఉంది. అక్కడ ధోని కనుక రాణిస్తే బీసీసీఐ నుంచి మళ్లీ పిలువు ఊహించవచ్చు. ఐపీఎల్‌లో ఆడే ఆటతోనే అతని భవితవ్యం ముడిపడి ఉంది. లేకపోతే ధోనిని జట్టులోకి ఎంపికచేయడం చాలా కష్టం. ధోని భారత క్రికెట్‌కు ఎంతో సేవ చేశాడు. కానీ ఆరునెలల పాటు జట్టుకు దూరంగా ఉంటే రిటైర్మెంట్‌పై సందేహాలు రావడం సహజమే’ అని కపిల్ అభిప్రాయపడ్డాడు.