
టీమిండియా ఆడేసుకుంటుంది..
చెన్నై: ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్ ను గెలిచి మంచి ఊపు మీద ఉన్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా.. నామమాత్రమైన చివరి టెస్టులోనూ ఆడేసుకుంటుంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ సాధించిన భారీ పరుగులకు దీటైన జవాబిస్తూ దూసుకుపోతుంది. సోమవారం నాల్గో రోజు ఆట తొలి సెషన్ లో వికెట్ మాత్రమే కోల్పోయి భారత్ జట్టు ఆధిక్యంలో నిలిచింది. భారత జట్టు 146.0 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 512 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. కరుణ్ నాయర్ 241 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 150 పరుగులు చేసి భారత జట్టును మరింత పటిష్ట స్థితికి చేర్చాడు.
ఆదివారం నాటి ఆటలో కేఎల్ రాహుల్ ఇంగ్లండ్ ను ఆడుకుంటే, ఈ రోజు ఆటలో కరుణ్ నాయర్ పరీక్షగా నిలిచాడు. ఈ క్రమంలోనే నాయర్ భారీ శతకం సాధించాడు. 391/4 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ అత్యంత నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. మురళీ విజయ్ అవుటైన తరువాత క్రీజ్లోకి వచ్చిన అశ్విన్ బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు. నాయర్-అశ్విన్లు సమయోచితంగా ఆడుతుండటంతో భారత జట్టు ఐదొందల మార్కును చేరింది. దాంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును భారత్ అధిగమించింది.