రాహుల్ మిస్సయ్యాడు.. నాయర్ సాధించాడు!
చెన్నై:ఒకరు మిస్సయ్యింది.. మరొకరు సాధించడమంటే ఇదేనేమో. ఇంగ్లండ్ తో చివరిటెస్టులో కేఎల్ రాహుల్ తృటిలో కోల్పోయిన డబుల్ సెంచరీని, కరుణ్ నాయర్ సాధించాడు. నాల్గో రోజు ఆటలో భాగంగా సోమవారం నాయర్ డబుల్ సెంచరీ సాధించాడు. 306 బంతులను ఎదుర్కొన్న నాయర్ 23 ఫోర్లు, 1 సిక్సర్లతో ద్విశతకం నమోదు చేశాడు. తద్వారా తన టెస్టు కెరీర్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నెలకొల్పాడు. ఈ రోజు ఆటలో 71 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన నాయర్ ఆద్యంతం ఇంగ్లండ్ బౌలర్లకు పరీక్షగా నిలిచి అరుదైన డబుల్ సెంచరీ మార్కును చేరాడు. మూడో రోజు ఆటలో కేఎల్ రాహుల్(199) పరుగు తేడాలో డబుల్ సెంచరీ కోల్పోయిన సంగతి తెలిసిందే.
అంతకుముందు 391/4 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ తొలి రెండు సెషన్లు పూర్తయ్యే సరికి వికెట్ మాత్రమే కోల్పోయింది. ఓవర్ నైట్ ఆటగాడు మురళీ విజయ్(29) అవుటయ్యాడు. ఆ తరువాత నాయర్ కు జతకలిసిన అశ్విన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే తొలుత అశ్విన్ హాఫ్ సెంచరీ చేయగా, ఆ తరువాత కొద్ది సేపటికి నాయర్ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ జోడి 150 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని సాధించి టీమిండియాను అత్యంత పటిష్ట స్థితికి చేర్చింది. భారత జట్టు 167.0 ఓవర్లు ముగిసే సరికి 593 పరుగులు చేసింది.