నాయర్ సరికొత్త రికార్డు
చెన్నై: భారత మిడిల్ ఆర్డర్ క్రికెటర్ కరుణ్ నాయర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్ తో ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో నాయర్ అరుదైన ఘనత సాధించాడు. ఒక మ్యాచ్లో ఐదు అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్లో నాయర్ 225 పరుగుల వ్యక్తిగత పరుగులను దాటిన క్రమంలో ధోని రికార్డును బ్రేక్ చేశాడు. 2013లో ఆస్ట్రేలియాపై ధోని 224 పరుగులను సాధించాడు. ఇదే ఇప్పటివరకూ ఐదు అంతకంటే తక్కువ స్థానాల్లో వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డుగా ఉంది. దీన్ని నాయర్ తాజాగా సవరించాడు.
మరొకవైపు తొలి సెంచరీని డబుల్ సెంచరీగా మార్చిన మూడో భారత ఆటగాడిగా నాయర్ నిలిచాడు. గతంలో దిలీప్ సర్దేశాయ్(200 నాటౌట్;న్యూజిలాండ్ పై1965లో), వినోద్ కాంబ్లి(224; ఇంగ్లండ్ పై 1993లో) ఈ ఘనత సాధించారు. ఇంగ్లండ్ తో ఐదో టెస్టు ద్వారా మొదటి సెంచరీని నాయర్ సాధించగా, దాన్ని డబుల్ గా మార్చుకున్నాడు. రోహిత్ శర్మ గాయంతో ఇంగ్లండ్ తో మూడో టెస్టులో నాయర్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. గత మ్యాచ్ల్లో ఘోరంగా విఫలమైన నాయర్.. ఈ మ్యాచ్లో పరుగుల దాహంతో చెలరేగిపోయాడు.