
కౌంటిన్హో ‘హ్యాట్రిక్’
► బ్రెజిల్ అద్భుత విజయం
► పెరూను నిలువరించిన ఈక్వెడార్
► కోపా అమెరికా కప్
లాస్ ఏంజెల్స్: ప్రత్యర్థి అనుభవలేమిని సొమ్ము చేసుకున్న బ్రెజిల్ జట్టు... కోపా అమెరికా కప్‌లో గోల్స్ వర్షం కురిపించింది. స్టార్ మిడ్‌ఫీల్డర్ ఫిలిప్పీ కౌంటిన్హో ‘హ్యాట్రిక్’ గోల్స్ నమోదు చేయడంతో బుధవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో 7-1తో హైతీపై విజయం సాధించింది. కౌంటిన్హో (14, 29, 92వ ని.), రెనాటో అగుస్టో (35, 86వ ని.), గాబ్రియోల్ (59వ ని.), లుకాస్ లిమా (67వ ని.)లు బ్రెజిల్‌కు గోల్స్ అందించగా, జేమ్స్ మెర్సిలిన్ (70వ ని.) హైతీ తరఫున ఏకైక గోల్ చేశాడు. పోటీ మ్యాచ్‌ల్లో బ్రెజిల్‌ను తొలిసారి ఎదుర్కొన్న హైతీ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది.
ఫలితంగా నాకౌట్ ఆశలు గల్లంతు కావడంతో టోర్నీ నుంచి నిష్ర్కమిస్తున్న తొలి జట్టుగా నిలిచింది. మ్యాచ్‌లో బ్రెజిల్ స్టార్ కౌంటిన్హో ఆరంభం నుంచే తన గారడీని ప్రదర్శించాడు. 14వ నిమిషంలో ఎడమ వైపు నుంచి బంతిని అందుకున్న కౌంటిన్హో... నేర్పుగా కుడి కాలి వైపు తీసుకొని కళ్లు చెదిరే రీతిలో గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. మరో 15 నిమిషాల్లోనే బంతిని డ్రిబ్లింగ్ చేస్తూ డానీ అల్విస్, జొనాస్‌ల సాయంతో రెండో గోల్ సాధించాడు. రెండు ఫ్లాంక్‌ల నుంచి దాడులు మొదలుపెట్టిన బ్రెజిల్‌కు ఆరు నిమిషాల తర్వాత మిడ్‌ఫీల్డర్ అగుస్టో మూడో గోల్ అందించాడు.
రెండో అర్ధభాగంలోనూ హైతీ కౌంటిన్హోను కట్టడి చేయడంపై ఎక్కువగా దృష్టిపెట్టడంతో... గాబ్రియోల్, లిమా బ్రెజిల్‌కు గోల్స్ అందించారు. 70వ నిమిషంలో వచ్చిన ఒకే ఒక్క అవకాశాన్ని హైతీ ఆటగాడు మెర్సిలిన్ అద్భుతమైన షాట్‌తో గోల్‌గా మలిచాడు. తర్వాత అగుస్టో బ్రెజిల్‌కు ఆరో గోల్ అందించగా, ఇంజ్యూరీ టైమ్‌లో కౌంటిన్హో మూడో గోల్ చేసి బ్రెజిల్‌కు స్పష్టమైన విజయాన్ని అందించాడు.
పోరాడిన ఈక్వెడార్: ఈక్వెడార్, పెరూల మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో డ్రా అయ్యింది. పెరూ తరఫున క్రిస్టియన్ క్యుయేవా (5వ ని.), ఎడిసన్ ఫ్లోరెస్ (13వ ని.) గోల్స్ చేయగా, ఎన్నార్ వాలెన్సియా (39వ ని.), మిల్లర్ బొలానోస్ (49వ ని.)లు ఈక్వెడార్‌కు గోల్స్ అందించారు.