
ఆధిక్యంలో కౌశల్-అమన్ జోడి
జాతీయ హోబి చాంపియన్‌షిప్
సాక్షి, హైదరాబాద్: ఇన్‌లాండ్ జాతీయ హోబి 16 సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన ఆర్టిలరీ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఏడబ్ల్యూఎస్‌ఏ) హవా కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ జలాల్లో సాగుతున్న ఈ పోటీల రెండో రోజు గురువారం 9 రేస్‌లు ముగిసే సరికి ఏడబ్ల్యూఎస్‌ఏ సెయిలర్లు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈ టీమ్‌కు చెందిన కౌశల్ కుమార్-అమన్ కుమార్ జోడి 12 పాయింట్లతో ముందంజలో ఉంది. గురువారం మొత్తం నాలుగు రేస్‌లు (6,7,8,9) జరగ్గా...మూడింటిలో వీరిద్దరు తొలి స్థానం అందుకోవడం విశేషం.
ఐఎన్‌ఎస్‌ఏ (ముంబై)కి చెందిన ఇమో లెమ్నోక్-శేఖర్ యాదవ్ జంట 19 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆరో రేస్‌లో మొదటి స్థానంలో నిలిచిన వీరు, ఏడు, ఎనిమిది రేస్‌లలో రెండో స్థానం అందుకున్నారు. ఓవరాల్ పాయింట్లలో సామల్ ప్రధాన్-రాహుల్ రాయ్ (ఐఎన్‌ఎస్‌ఏ) ద్వయం 24 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. 6,9 రేస్‌లలో రెండో స్థానం సాధించిన ఈ టీమ్, 7వ రేస్‌లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. సచిన్ సింఘా-వీర్ సింగ్ కౌరవ్ సభ్యులుగా ఉన్న సికింద్రాబాద్ టీమ్ ఈఎంఈఎస్‌ఏ 62 పాయింట్లతో ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ జాబితాలో టాప్-12లో ఎనిమిది టీమ్‌లు ఏడబ్ల్యూఎస్‌ఏవే కావడం విశేషం. చాంపియన్‌షిప్‌లో శుక్రవారం చివరి మూడు రేస్‌లు జరుగుతాయి.