కామన్వెల్త్ విజేతలకు కేసీఆర్ భారీ నజరానా
హైదరాబాద్: కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన తెలుగుతేజాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు భారీ నజరానా ప్రకటించారు. స్వర్ణ, రజత, కాంస్య పతక విజేతలకు వరుసగా 50 లక్షలు, 25 లక్షలు, 15 లక్షల రూపాయిల చొప్పున నగదు బహుమతులు అందజేయనున్నారు. పసిడి పతకం సాధించిన పారుపల్లి కశ్యప్ 50 లక్షల నగదు బహుమతి అందుకోనున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ సాధించిన సైనా నెహ్వాల్ కు 20 లక్షల రూపాయిలు ఇవ్వనున్నారు. ఇక బ్యాడ్మింటన్ కోచ్ లు పుల్లెల గోపీచంద్, ఆరిఫ్ లకు 50 లక్షల రూపాయిల చొప్పున నగదు బహుమతులు ఇవ్వనున్నారు.
కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన విజేతలు బుధవారం కే చంద్రశేఖర రావును కలిశారు. వీరిలో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, సైనా, పీవీ సింధు, గుత్తా జ్వాల, గురుసాయి దత్, షూటర్ గగన్ నారంగ్ ఉన్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వీరికి ప్రోత్సాహకాలు అందజేస్తారు. తమకు ప్రోత్సహకాలు ప్రకటించినందుకు క్రీడాకారులు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో మంత్రి కే రామారావు పాల్గొన్నారు.