
న్యూఢిల్లీ: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో చివరి మూడు వన్డేల కోసం తనని భారత జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తనను ఎందుకు ఎంపిక చేయలేదో తెలియదంటూ పేర్కొన్న జాదవ్.. ఇందుకు సంబంధించి ఎవరూ కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఫిట్‌నెస్ కారణంగా పక్కకు పెట్టామన్న బీసీసీఐ సెలక్టర్లు.. ఫిట్‌నెస్ సాధించాక కూడా ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో అర్థం కావడం లేదంటూ బహిరంగంగా విమర్శించాడు. అయితే పరిస్థితి అర్థం చేసుకోవాలంటూ తొలుత నచ్చచెప్పేందుకు యత‍్నించిన చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.. జాదవ్‌ను చివరి రెండు వన్డేల్లో చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు చిన్న సవరణ అంటూ కేదార్ జాదవ్‌కు చివరి రెండు వన్డేల్లో అవకాశం ఇస్తున్నట్లు శుక్రవారం బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. వెస్టిండీస్‌తో చివరి మూడు వన్డేల కోసం 15 మందితో కూడిన భారత జట్టుని సెలక్టర్లు గురువారం సాయంత్రమే ప్రకటించారు. అయితే ఈ జట్టులో సెలక్టర్లు కేదార్ జాదవ్‌కు చోటు కల్పించలేదు. దీంతో పూర్తి ఫిట్‌నెస్ సాధించినా సెలక్టర్లు ఎందుకు జట్టులోకి ఎంపిక చేయలేదంటూ జాదవ్ ప్రశ్నించగా.. బీసీసీఐ సెలక్టర్లు దిగి రాక తప్పలేదు.
ఇది ఎమ్మెస్కే మాట..
‘కేదార్ జాదవ్ తరచుగా గాయపడతాడన్న కారణంగా మూడో వన్డేలోకి ఎంపిక చేయలేదు. గతంలోనూ ఒకటి రెండుసార్లు అతను జట్టులోకి పునరాగమనం చేయడం, వెంటనే గాయపడటం జరిగింది. దేశవాళీలో ఆడించేందుకు భారత-ఎ జట్టులో గురువారం చోటిచ్చాం. కేవలం అతనికి ఒక మ్యాచ్‌లో మాత్రమే ఆడే అవకాశం దక్కింది. అతడి ఫిట్‌నెస్‌పై ఓ అంచనాకి రాలేమని విండీస్‌తో చివరి 3 వన్డేలకు ఛాన్స్ ఇవ్వలేదని జాదవ్‌కు ఎమ్మెస్కే ప్రసాద్ సర్ది చెప్పారు.
మనసు మార్చుకున్నారు
అయితే, ఏమైందో ఏమో తెలియదు గానీ... ఎమ్మెస్కే మనసు మార్చుకుని జాదవ్‌ను విండీస్‌తో చివరి రెండు వన్డేల్లో చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి కేదార్ జాదవ్‌ను చివరి రెండు వన్డేలకు ఎంపిక చేశామని ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకటించారు. వెస్టిండిస్‌తో ఐదు వన్డేల సిరిస్ అనంతరం జరగనున్న మూడు టీ20ల సిరీస్‌తో పాటు ఆసీస్ పర్యటనకు సంబంధించి టెస్టు జట్టును భారత సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా, విండీస్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లికి విశ్రాంతినిచ‍్చిన సెలక్టర్లు.. ఓపెనర్ రోహిత్ శర్మకు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
UPDATE - @JadhavKedar has been included in #TeamIndia squad for the 4th and 5th ODI against Windies.#INDvWI
— BCCI (@BCCI) 26 October 2018