మిగుల్ కమిన్స్
ఆంటిగ్వా: టీమిండియాతో జరిగిన టీ20, వన్డే సిరీస్‌ల్లో వైట్‌వాష్ అయిన వెస్టిండీస్‌కు టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే ఎదురుదెబ్బ తగిలింది. విండీస్ ఆల్ రౌండర్ కీమో పాల్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఎడమ చీలమండ గాయంతో పాల్ తొలి టెస్టు నుంచి వైదొలిగినట్లు విండీస్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ప్రస్తుతం కీమో పాల్‌ను జట్టుతో పాటే కొనసాగిస్తున్న విండీస్.. రెండో టెస్టుకు అతను అందుబాటులోకి వస్తాడని ఆశిస్తోంది. కాగా, తొలి టెస్టులో పాల్ స్థానంలో మరొక ఫాస్ట్ బౌలర్ మిగుల్ కమిన్స్‌కు చోటు కల్పించింది. ఈ విషయాన్ని విండీస్ మేనేజ్‌మెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
‘ గాయం కారణంగా కీమో పాల్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. అతని స్థానాన్ని మిగుల్ కమిన్స్ భర్తీ చేస్తాడని ఆశిస్తున్నాం. భారత్-ఏతో జరిగిన మ్యాచ్‌ల్లో కమిన్స ఆకట్టుకున్నాడు. మరొకవైపు నెట్స్‌లో కూడా ఎంతో పరిణిత కనబరిచాడు’ అని తెలిపింది. మూడేళ్ల క్రితం టీమిండియాతో జరిగిన మ్యాచ్ ద్వారా కమిన్స్ అరంగేట్రం చేశాడు. సెయింట్ లూసియా వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో కమిన్స్ 9 వికెట్లు సాధించాడు. ప్రధానంగా రెండో ఇన్నింగ్స్‌లో 48 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు సాధించాడు. ఇదే అతని కెరీర్ అత్యుత్తమం. సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ రోజు తొలి టెస్టు ఆరంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment