కేరళ బ్లాస్టర్స్‌కు ఓ పాయింట్
కోల్‌కతాతో మ్యాచ్ డ్రా
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో సచిన్ టెండూల్కర్ యజమానిగా ఉన్న కేరళ బ్లాస్టర్స్ జట్టు ఎట్టకేలకు పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన ఈ జట్టు ఆదివారం పటిష్ట అట్లెడికో డి కోల్‌కతాతో మాత్రం 1-1తో డ్రా చేసుకోగలిగింది. దీంతో ఒక పాయింట్ దక్కించుకుంది. మరోవైపు దూకుడు మీదున్న కోల్‌కతా ఒక్క ఓటమి కూడా లేకుండా 11 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
అయితే స్టార్ ఫార్వర్డ్ ఫిక్రూ టెఫెరాపై సస్పెన్షన్ వేటు జట్టు ఆటతీరుపై బాగానే ప్రభావం చూపించింది. ఆరంభంలో మాత్రం కోల్‌కతా జోరుగానే ఆడింది. 22వ నిమిషంలోనే బల్జీత్ సహానీ కుడి కాలుతో గోల్ కీపర్‌ను ఏమార్చుతూ చేసిన గోల్‌తో కోల్‌కతా 1-0 ఆధిక్యం సాధించింది. కొద్ది నిమిషాల్లోనే మరో అవకాశం వచ్చినా కేరళ డిఫెండర్ హెంగ్‌బార్ట్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. 41వ నిమిషంలో మిలగ్రెస్ ఇచ్చిన పాస్‌ను ఇయాన్ హుమే గోల్‌గా మలచడంతో కేరళ స్కోరును 1-1తో సమం చేయగలిగింది. ద్వితీయార్ధంలో గోల్స్ కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డా సఫలం కాలేకపోయాయి.
పుణేకు తొలి విజయం: మరోవైపు ఎఫ్‌సీ గోవాతో జరిగిన మ్యాచ్‌లో పుణే 2-0తో నెగ్గింది. అటు గోవా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడి, మరో పోటీని డ్రా చేసుకుంది. 42వ నిమిషంలో కొస్టాస్ కట్సౌరనీస్ చేసిన గోల్‌తో పుణే 1-0 ఆధిక్యం సాధించింది. 81వ నిమిషంలో 37 ఏళ్ల డేవిడ్ ట్రెజెగ్వెట్ పుణే జట్టుకు రెండో గోల్‌ను అందించాడు.