పైనల్లో కేరళ బ్లాస్టర్స్
రెండో అంచె సెమీస్‌లో 1-3తో ఓటమి
మెరుగైన గోల్స్ సగటుతో ఫైనల్‌కు
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు చెందిన కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ జట్టు ఫైనల్‌కు చేరింది. టోర్నీ ఆరంభంలో అంతగా రాణించని ఈ జట్టు చివరి దశలో మాత్రం మెరుపులు సృష్టించింది. మంగళవారం జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో చెన్నైయిన్ ఎఫ్‌సీతో జరిగిన రెండో అంచె సెమీస్‌లో కేరళ 1-3తో ఓడింది. అయితే కొచ్చిలో జరిగిన తొలి అంచె సెమీస్‌లో కేరళ 3-0తో నెగ్గింది. ఈ మ్యాచ్‌లో చేసిన ఒక్క గోల్‌తో ఈ జట్టు మొత్తం గోల్స్ సంఖ్య నాలుగు అయింది. దీంతో ఒక్క గోల్ తేడాతో తుది పోరుకు అర్హత సాధించినట్టయ్యింది. చెన్నై తరఫున సిల్వెస్ట్రె (42వ నిమిషంలో), జెజె (90వ ని.)గోల్ చేయగా 76వ నిమిషంలో కేరళ ఆటగాడు సందేశ్ జింగాన్ సెల్ఫ్ గోల్‌తో ప్రత్యర్థికి ఆధిక్యం ఇచ్చాడు. అయితే విజయానికి కావాల్సిన గోల్‌ను ఎక్స్‌ట్రా సమయంలో (117 ని.లో) పియర్సన్ సాధించి కేరళను సంబరాల్లో ముంచాడు. అంతకుముందు ఆద్యం తం మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టు సాగింది. 28వ నిమిషంలోనే కేరళ నుంచి ఎంకాలిస్టర్ రెడ్ కార్డుకు గురయ్యాడు. నిర్ణీత సమయంలో చెన్నైయిన్ మూడు గోల్స్ చేయడంతో ఫలితం తేలేందుకు అదనపు సమయం ఆడాల్సి వచ్చింది. 104వ నిమిషంలో మెటరాజ్జి (చెన్నై) రెండో ఎల్లో కార్డ్‌కు గురవ్వడంతో మైదానం వీడాడు. ఇక మ్యాచ్ మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా పియర్సన్ ఇన్‌సైడ్ బాక్సులోకి పరిగెత్తుకెళ్లి ఎడమకాలితో బంతిని నెట్‌లోకి పంపాడు.