అది వారినే అడగండి: విజేందర్ సింగ్
న్యూఢిల్లీ:డబ్యూబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ను సాధించిన భారత బాక్సర్ విజేందర్ సింగ్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ హోప్తో జరిగిన పది రౌండ్ల బౌట్లో ఏకపక్ష విజయం సాధించడం తన కెరీర్లోనే అతి పెద్ద విజయంగా విజేందర్ అభివర్ణించాడు.
' ఇదొక అద్భుత విజయం. అసలు ఈ పోరు గురించి ఏమీ చెప్పాలో కూడా తెలియడం లేదు. కానీ నా దేశానికి ఈ గెలుపు చాలా ముఖ్యం. సరైన ప్రణాళికలతో రింగ్ లోకి దిగడంతోనే హోప్పై విజయం సాధించాను. ఇప్పటివరకూ నేను ఎదుర్కొన్న బాక్సర్లలో హోప్ కఠిన ప్రత్యర్థి. అతనిపై విజయం అంత సులువుగా లభించలేదు. కాకపోతే చివరకు గెలవడం చాలా ఆనందాన్నిచ్చింది' అని విజేందర్ తన మనసులో ఆనందాన్ని పంచుకున్నాడు. కాగా, భారత్లో బాక్సింగ్ క్రీడపై ఈ విజయం ప్రభావం ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నకు విజేందర్ బదులిస్తూ... ఆ విషయం తనకు తెలియదన్నాడు. చాలామంది భారత ప్రజలు తన పోరును వీక్షించిన మాట వాస్తవమే అయినా, ఈ క్రీడ గురించి వారిని అడిగితేనే బాగుంటుందన్నాడు. అసలు బాక్సింగ్ క్రీడను భారత ప్రజలు ఇష్టపడతారా?లేదా? అనేది వారి ద్వారా మాత్రమే తెలుస్తుందన్నాడు. అయితే తన పనిని సమర్ధవంతంగా నిర్వర్తించడంతో భారత్లో బాక్సింగ్ మరింత ముందుకెళుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు.
గత ఆరు బౌట్లలో ప్రత్యర్థులను నాకౌట్ చేసి జోరు మీదున్న విజేందర్... శనివారం త్యాగరాజన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన బౌట్‌లో 98-92, 98-92, 100-90తో కెర్రీపై నెగ్గాడు. దీంతో ప్రపంచ ప్రొఫెషనల్ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానానికి చేరి మరిన్ని పెద్ద బౌట్‌లకు రంగం సిద్ధం చేసుకున్నాడు.