Kerry Hope
-
అది వారినే అడగండి: విజేందర్ సింగ్
న్యూఢిల్లీ:డబ్యూబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌ను సాధించిన భారత బాక్సర్ విజేందర్ సింగ్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ హోప్‌తో జరిగిన పది రౌండ్ల బౌట్లో ఏకపక్ష విజయం సాధించడం తన కెరీర్లోనే అతి పెద్ద విజయంగా విజేందర్ అభివర్ణించాడు. ' ఇదొక అద్భుత విజయం. అసలు ఈ పోరు గురించి ఏమీ చెప్పాలో కూడా తెలియడం లేదు. కానీ నా దేశానికి ఈ గెలుపు చాలా ముఖ్యం. సరైన ప్రణాళికలతో రింగ్ లోకి దిగడంతోనే హోప్‌పై విజయం సాధించాను. ఇప్పటివరకూ నేను ఎదుర్కొన్న బాక్సర్లలో హోప్ కఠిన ప్రత్యర్థి. అతనిపై విజయం అంత సులువుగా లభించలేదు. కాకపోతే చివరకు గెలవడం చాలా ఆనందాన్నిచ్చింది' అని విజేందర్ తన మనసులో ఆనందాన్ని పంచుకున్నాడు. కాగా, భారత్‌లో బాక్సింగ్ క్రీడపై ఈ విజయం ప్రభావం ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నకు విజేందర్ బదులిస్తూ... ఆ విషయం తనకు తెలియదన్నాడు. చాలామంది భారత ప్రజలు తన పోరును వీక్షించిన మాట వాస్తవమే అయినా, ఈ క్రీడ గురించి వారిని అడిగితేనే బాగుంటుందన్నాడు. అసలు బాక్సింగ్ క్రీడను భారత ప్రజలు ఇష్టపడతారా?లేదా? అనేది వారి ద్వారా మాత్రమే తెలుస్తుందన్నాడు. అయితే తన పనిని సమర్ధవంతంగా నిర్వర్తించడంతో భారత్‌లో బాక్సింగ్ మరింత ముందుకెళుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. గత ఆరు బౌట్లలో ప్రత్యర్థులను నాకౌట్ చేసి జోరు మీదున్న విజేందర్... శనివారం త్యాగరాజన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన బౌట్లో 98-92, 98-92, 100-90తో కెర్రీపై నెగ్గాడు. దీంతో ప్రపంచ ప్రొఫెషనల్ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానానికి చేరి మరిన్ని పెద్ద బౌట్లకు రంగం సిద్ధం చేసుకున్నాడు. -
ఈ టైటిల్ ఆ దిగ్గజానికి అంకితం
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన భారత బాక్సర్ విజేందర్ సింగ్ వరుస బౌట్లలో ప్రత్యర్థులను మట్టికరిస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రొఫెషనల్‌గా మారిన ఈ స్టార్ ఆటగాడు తన కెరీర్లోనే అతి పెద్ద విజయాన్ని సాధించాడు. శనివారం త్యాగరాజన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కెర్రీ హోప్ (ఆస్ట్రేలియా)తో జరిగిన బౌట్లో విజయం సాధించి ‘డబ్ల్యూబీఓ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్’ టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. ఈ టైటిల్ ను గతనెల మూడో తేదీన కన్నుమూసిన బాక్సింగ్ లెజెండ్ మొహమ్మద్ అలీ కి అంకితమిస్తున్నట్లు విజేందర్ ప్రకటించాడు. ఈ తాజా బౌట్లో 98-92, 98-92, 100-90 తేడాతో కెర్రీపై నెగ్గడంతో ప్రపంచ ప్రొఫెషనల్ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానానికి చేరి మరిన్ని పెద్ద బౌట్లకు రంగం సిద్ధం చేసుకున్నాడు. మూడు రౌండ్ల వరకూ బౌట్ హోరాహోరీగా సాగింది. అయితే నాలుగో రౌండ్లో విజేందర్ విసిరిన రైట్ హుక్ ప్రత్యర్థి కెర్రీ హోప్ ఎడమ కన్నుపై బలంగా తాకింది. అక్కడి నుంచి విజేందర్ బౌట్ లో చురుగ్గా కదులుతూ, డిఫెన్స్ కు ప్రాధాన్యమిస్తూ ప్రత్యర్థిపై సంచలన విజయాన్ని నమోదుచేశాడు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, క్రికెటర్లు యువరాజ్, రైనా, సెహ్వాగ్, బాక్సర్ మేరీకామ్, నటి నేహా ధూపియా, ఇతర ప్రముఖులు ఈ బౌట్‌ను తిలకించారు. -
అది నాకు బిగ్ డీల్ కాదు: విజేందర్
న్యూఢిల్లీ:తనకు డబ్యూబీవో ఆసియా టైటిల్ బౌట్ అనేది ఎంతమాత్రం బిగ్ డీల్ కాదని భారత ప్రొ బాక్సర్ విజేందర్ సింగ్ స్పష్టం చేశాడు. ఈ పోరును సాధారణ బౌట్ గా మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నట్లు విజేందర్ పేర్కొన్నాడు. తన కెరీర్ లో పాల్గొన్న బాక్సింగ్ బౌట్ ల మాదిరిగానే, డబ్యూబీవో బౌట్ ను కూడా చూస్తున్నట్లు తెలిపాడు. ' నేను వరుసగా ఆరు ప్రొ బాక్సింగ్ బౌట్లు గెలిచా. అదే తరహాలో ఇది నాకు మరొక బౌట్. ఇప్పుడు నేను ప్రొ బాక్సర్ ని. అలానే తదుపరి బౌట్ కు సిద్దమవుతున్నా' అని విజేందర్ అన్నాడు. శనివారం జరిగే పోరుతో తన బాక్సింగ్ కెరీర్ ఏమీ ముగిసిపోదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ హోప్ తో జరిగే ఆ బౌట్ హోరాహోరీగా జరిగినా, మిగతా ఫైట్ తరహాలోనే ఈ పోరును కూడా చూస్తానన్నాడు. రింగ్ లోకి వెళ్లాక విజయంపైనే తన దృష్టి ఉంటుందన్నాడు. ఆ బౌట్ ముగిశాక మరో బౌట్ పై దృష్టిపెడతానని విజేందర్ పేర్కొన్నాడు. తన బౌట్లను ఉద్యోగంతో పోల్చిన విజేందర్.. ఈ పోరుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు తెలిపాడు. డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ కోసం జూలై 16న స్థానిక త్యాగరాజ స్టేడియంలో విజేందర్ -హోప్‌లు తలపడనున్న సంగతి తెలిసిందే. ప్రొఫెషనల్‌గా మారిన విజేందర్ ఓటమి లేకుండా ఆరు నాకౌట్ విజయాలతో జోరు మీదున్నాడు. మరోవైపు ఈ రంగంలో 12 ఏళ్ల అనుభవం ఉన్న హోప్... ఇప్పటిదాకా తను 30 బౌట్లలో రెండు నాకౌట్లతో పాటు 23 విజయాలను సాధించాడు. -
'విజేందర్ కళ్లలో భయం చూశా'
న్యూఢిల్లీ: డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ కోసం భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్‌తో తలపడబోతున్న ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ హోప్ మాటల యుద్ధాన్ని ముమ్మరం చేశాడు. భారత్ లో విజేందర్ స్టార్ కావొచ్చని, కానీ తన వరకూ బాక్సర్ మాత్రమేనని గతంలో వ్యాఖ్యానించిన హోప్.. తనతో పోటీ పడే స్థాయి అతనికి లేదన్నాడు. 'విజయం సాధించాలనే ఆసక్తి విజేందర్‌లో చాలా ఎక్కువ. అయితే నా బౌట్లో అది వదులుకోవాల్సిందే. ఆ విషయం అతనికి, నాకు తెలుసు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విజేందర్ కళ్లలో భయం చూశా. నాతో పోరంటే విజేందర్ భయపడుతున్నాడు. వరుస విజయాలు అతను సాధిస్తూ ఉండవచ్చు. అసలైన ప్రొఫెషనల్ బాక్సింగ్ అంటే ఏమిటో విజేందర్కు చూపిస్తా' అని కెర్రీ హోప్ విజయంపై భరోసా వ్యక్తం చేశాడు. ఇప్పటివరకూ విజేందర్ సుదీర్ఘ రౌండ్ల పోరు ఆడిన సందర్భాలు చాలా తక్కువని హోప్ పేర్కొన్నాడు. ఆది నుంచి విజేందర్ పై ఒత్తిడి పెంచి అతని భరతం పడతానన్నాడు. స్వదేశంలో విజేందర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా బాగుందని, అయితే అథ్లెట్‌కు కావాల్సింది అనుభవం మాత్రమేనన్న సంగతి గుర్తుంచుకోవాలన్నాడు. అభిమానుల సహకారం అనేది బాక్సింగ్‌లో అస్సలు పనిచేయదన్నాడు. కేవలం ఇద్దరు బాక్సర్లతో పాటు రిఫరీ మాత్రమే ఉండే రింగ్ లో విశేష అభిమానం ఎంతమాత్రం ఉపయోగపడదని చురకలంటించాడు. డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ కోసం జూలై 16న స్థానిక త్యాగరాజ స్టేడియంలో విజేందర్ -హోప్‌లు తలపడనున్న సంగతి తెలిసిందే. ప్రొఫెషనల్‌గా మారిన విజేందర్ ఓటమి లేకుండా ఆరు నాకౌట్ విజయాలతో జోరు మీదున్నాడు. మరోవైపు ఈ రంగంలో 12 ఏళ్ల అనుభవం ఉన్న హోప్... ఇప్పటిదాకా తను 30 బౌట్లలో రెండు నాకౌట్లతో పాటు 23 విజయాలను సాధించాడు. -
విజేందర్ ప్రత్యర్థి కెర్రీ హోప్
► జూలై 16న డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ బౌట్ ► తొలి టికెట్ సెహ్వాగ్‌కు న్యూఢిల్లీ: డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ కోసం స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. జూలై 16న జరిగే ఈ బౌట్లో ఆస్ట్రేలియాకు చెందిన మాజీ యూరో చాంపియన్ కెర్రీ హోప్‌తో తను తలపడతాడు. స్థానిక త్యాగరాజ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. ప్రొఫెషనల్‌గా మారిన విజేందర్ ఓటమి లేకుండా ఆరు నాకౌట్ విజయాలతో జోరు మీదున్నాడు. మరోవైపు హోప్‌కు ఈ రంగంలో 12 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పటిదాకా తను 30 బౌట్లలో తలపడగా రెండు నాకౌట్లతో పాటు 23 విజయాలున్నాయి. ఇక పోటీకి రెండు నెలల సమయం ఉండగా అప్పుడే మాటల యుద్ధం ప్రారంభమైంది. ‘విజేందర్ భారత్‌లో స్టార్ కావచ్చు కానీ నా వరకు ఓ బాక్సర్ మాత్రమే. ఏడాది క్రితమే విజేందర్ ప్రొగా మారాడు. నాకు 12 ఏళ్ల అనుభవం ఉంది. స్వదేశంలో ఒత్తిడంతా అతడి పైనే ఉంటుంది. ఇది నా విజయాన్ని సునాయాసం చేస్తుంది’ అని హోప్ అన్నాడు. అయితే బౌట్ జరిగే రోజు ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుందని విజేందర్ తేలిగ్గా తీసుకున్నాడు. మరోవైపు తొలి టికెట్‌ను తన స్నేహితుడు మాజీ క్రికెటర్ సెహ్వాగ్‌కు అందించాడు. -
డబ్ల్యూబీవో బౌట్లో విజేందర్ ప్రత్యర్థి ఖరారు
న్యూఢిల్లీ:ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్లో దూసుకుపోతున్న భారత బాక్సర్ విజేందర్ సింగ్ తన తదుపరి పోరులో భాగంగా సొంత ప్రేక్షకుల మధ్య ఆడనున్న డబ్ల్యూబీవోఆసియా టైటిల్ బౌట్ లో ప్రత్యర్థిని తాజాగా ఖరారు చేశారు. ఈనెల 16 వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో త్యాగరాజ స్టేడియంలో జరగునున్న డబ్యూబీవో బౌట్లో ఆస్ట్రేలియాకు చెందిన కెర్రీ హోప్ తో విజేందర్ తలపడనున్నాడు. ఇప్పటివరకూ విజేందర్‌తో చైనా బాక్సర్ తో కానీ, కొరియన్ బాక్సర్ తో కానీ తలపడే అవకాశం ఉందని భావించారు. అయితే యూరోపియన్ మాజీ చాంపియన్ కెర్రీతో విజేందర్ పోరును ఖరారు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. గత ఏడాది ప్రొఫెషన్ బాక్సింగ్‌లో అడుగుగపెట్టిన విజేందర్ వరుస ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి అప్రతిహతంగా తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. ఈ ఆరు బౌట్లను నాకౌట్‌గా ముగించి విజేందర్ తన సత్తా చాటుకున్నాడు. మరోవైపు 30 బౌట్లకు గాను 23 బౌట్లలో విజయం సాధించిన కెర్రీ.. అందులో రెండింటిని మాత్రమే నాకౌట్‌గా గెలిచాడు. ఈ బౌట్‌పై కెర్రీ హోప్ స్పందించాడు. భారత్‌లో విజేందర్ సూపర్ స్టార్ కావొచ్చు. నా దృష్టిలో అతనొక బాక్సర్. అతను ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అడుగుపెట్టి ఏడాది మాత్రమే అయ్యింది. నాకు అందులో 12 సంవత్సరాల అనుభవం ఉంది. భారత్ లో జరిగే ఈ పోరులో విజేందర్ కే మద్దతు ఉంటుందని నాకు తెలుసు. దాంతో నేను అండర్ డాగ్‌గానే బరిలోకి దిగుతాను. ఆ నేపథ్యంలో నాపై ఎటువంటి ఒత్తిడి ఉంటుంది. విజేందర్ పై ఒత్తిడి ఉంటుంది 'అని కెర్రీ తెలిపాడు.