'విజేందర్ కళ్లలో భయం చూశా'
న్యూఢిల్లీ: డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ కోసం భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్తో తలపడబోతున్న ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ హోప్ మాటల యుద్ధాన్ని ముమ్మరం చేశాడు. భారత్ లో విజేందర్ స్టార్ కావొచ్చని, కానీ తన వరకూ బాక్సర్ మాత్రమేనని గతంలో వ్యాఖ్యానించిన హోప్.. తనతో పోటీ పడే స్థాయి అతనికి లేదన్నాడు. 'విజయం సాధించాలనే ఆసక్తి విజేందర్లో చాలా ఎక్కువ. అయితే నా బౌట్లో అది వదులుకోవాల్సిందే. ఆ విషయం అతనికి, నాకు తెలుసు. ప్రెస్ కాన్ఫరెన్స్లో విజేందర్ కళ్లలో భయం చూశా. నాతో పోరంటే విజేందర్ భయపడుతున్నాడు. వరుస విజయాలు అతను సాధిస్తూ ఉండవచ్చు. అసలైన ప్రొఫెషనల్ బాక్సింగ్ అంటే ఏమిటో విజేందర్కు చూపిస్తా' అని కెర్రీ హోప్ విజయంపై భరోసా వ్యక్తం చేశాడు.
ఇప్పటివరకూ విజేందర్ సుదీర్ఘ రౌండ్ల పోరు ఆడిన సందర్భాలు చాలా తక్కువని హోప్ పేర్కొన్నాడు. ఆది నుంచి విజేందర్ పై ఒత్తిడి పెంచి అతని భరతం పడతానన్నాడు. స్వదేశంలో విజేందర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా బాగుందని, అయితే అథ్లెట్కు కావాల్సింది అనుభవం మాత్రమేనన్న సంగతి గుర్తుంచుకోవాలన్నాడు. అభిమానుల సహకారం అనేది బాక్సింగ్లో అస్సలు పనిచేయదన్నాడు. కేవలం ఇద్దరు బాక్సర్లతో పాటు రిఫరీ మాత్రమే ఉండే రింగ్ లో విశేష అభిమానం ఎంతమాత్రం ఉపయోగపడదని చురకలంటించాడు.
డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ కోసం జూలై 16న స్థానిక త్యాగరాజ స్టేడియంలో విజేందర్ -హోప్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ప్రొఫెషనల్‌గా మారిన విజేందర్ ఓటమి లేకుండా ఆరు నాకౌట్ విజయాలతో జోరు మీదున్నాడు. మరోవైపు ఈ రంగంలో 12 ఏళ్ల అనుభవం ఉన్న హోప్... ఇప్పటిదాకా తను 30 బౌట్లలో రెండు నాకౌట్‌లతో పాటు 23 విజయాలను సాధించాడు.