అది నాకు బిగ్ డీల్ కాదు: విజేందర్
న్యూఢిల్లీ:తనకు డబ్యూబీవో ఆసియా టైటిల్ బౌట్ అనేది ఎంతమాత్రం బిగ్ డీల్ కాదని భారత ప్రొ బాక్సర్ విజేందర్ సింగ్ స్పష్టం చేశాడు. ఈ పోరును సాధారణ బౌట్ గా మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నట్లు విజేందర్ పేర్కొన్నాడు. తన కెరీర్ లో పాల్గొన్న బాక్సింగ్ బౌట్ ల మాదిరిగానే, డబ్యూబీవో బౌట్ ను కూడా చూస్తున్నట్లు తెలిపాడు.
' నేను వరుసగా ఆరు ప్రొ బాక్సింగ్ బౌట్లు గెలిచా. అదే తరహాలో ఇది నాకు మరొక బౌట్. ఇప్పుడు నేను ప్రొ బాక్సర్ ని. అలానే తదుపరి బౌట్ కు సిద్దమవుతున్నా' అని విజేందర్ అన్నాడు. శనివారం జరిగే పోరుతో తన బాక్సింగ్ కెరీర్ ఏమీ ముగిసిపోదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ హోప్ తో జరిగే ఆ బౌట్ హోరాహోరీగా జరిగినా, మిగతా ఫైట్ తరహాలోనే ఈ పోరును కూడా చూస్తానన్నాడు. రింగ్ లోకి వెళ్లాక విజయంపైనే తన దృష్టి ఉంటుందన్నాడు. ఆ బౌట్ ముగిశాక మరో బౌట్ పై దృష్టిపెడతానని విజేందర్ పేర్కొన్నాడు. తన బౌట్లను ఉద్యోగంతో పోల్చిన విజేందర్.. ఈ పోరుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు తెలిపాడు.
డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ కోసం జూలై 16న స్థానిక త్యాగరాజ స్టేడియంలో విజేందర్ -హోప్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ప్రొఫెషనల్‌గా మారిన విజేందర్ ఓటమి లేకుండా ఆరు నాకౌట్ విజయాలతో జోరు మీదున్నాడు. మరోవైపు ఈ రంగంలో 12 ఏళ్ల అనుభవం ఉన్న హోప్... ఇప్పటిదాకా తను 30 బౌట్లలో రెండు నాకౌట్‌లతో పాటు 23 విజయాలను సాధించాడు.