నేడు విజేందర్ డబ్ల్యుబీవో టైటిల్ బౌట్
తొలిసారిగా భారత్‌లో బరిలోకి
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన అనంతరం విజేందర్ సింగ్ తొలిసారిగా స్వదేశంలో బరిలోకి దిగబోతున్నాడు. ఇప్పటిదాకా తలపడిన ఆరు బౌట్లలో ఓటమనేది లేకుండా దూసుకెళుతున్న ఈ స్టార్ నేడు (శనివారం) జరిగే డబ్ల్యుబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ బెల్ట్ కోసం పోటీపడనున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన కెర్రీ హోప్ తన ప్రత్యర్థి. ‘ఈ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఆరేళ్ల అనంతరం ఢిల్లీలో పోటీకి దిగుతున్నాను. చివరిసారిగా కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్నాను.
నా శిక్షణ చాలా కఠినంగానే సాగింది. హోప్‌పై విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. ఇందులో నెగ్గితే డబ్ల్యుబీవో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-15లో ఉంటాను. దీంతో ప్రపంచ టైటిళ్ల కోసం పోటీపడే అర్హత దక్కుతుంది’ అని 30 ఏళ్ల విజేందర్ తెలిపారు. త్యాగరాజ స్టేడియంలో జరిగే ఈ ఫైట్‌ను తిలకించేందుకు క్రీడా ప్రముఖులతో పాటు రాజకీయ, సినీ రంగానికి చెందినవారు కూడా హాజరుకానున్నారు. అలాగే ఈ ఫైట్‌కు ముందు మరో ఏడు ఇతర బౌట్స్ జరుగుతాయి.
రా. గం. 7.00 నుంచి స్టార్‌స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం