‘రాననుకున్నారా! రాలేననుకున్నారా!!’ అనే సీన్మా డైలాగ్‌ను విజేందర్‌సింగ్ విషయంలో భేషుగ్గా వాడుకోవచ్చు. 2019 తరువాత ఈ ప్రొఫెషనల్ బాక్సర్ మళ్లీ రింగ్‌లోకి దిగుతున్నాడు. రష్యన్ బాక్సర్ లొప్సన్‌తో తలపడబోతున్నాడు. ఈసారి ప్రత్యేకత షిప్. గోవా మాండవి నదిలో మెజిస్టిక్ ప్రైడ్ క్యాసీనో షిప్ పై భాగంలో ఎల్లుండి జరిగే ఈ బౌట్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో....
ఇప్పుడిప్పుడే రింగ్‌లో బుడిబుడి అడుగులు వేస్తున్న బాక్సర్‌లతో పాటు, బాలీవుడ్ సినిమాలలో బాక్సర్ వేషాలు వేయాలనుకునే నటులకు కూడా విజేందర్ రోల్‌మోడల్. యువ నటుడు అక్షయ్ ఒబెరాయ్‌కి ఒక సినిమా కోసం బాక్సర్ ఫిజిక్ కావల్సి వచ్చింది. దీని కోసం లోకల్ ట్రైనర్‌ను సంప్రదిస్తే ‘విజేందర్ సింగ్ డైట్’ సూచించాడు. అక్షరాల ఆ డైట్‌ను పాటించి అద్భుత ఫలితాన్ని సాధించాడు ఆ నటుడు. ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అపురూపమైన విజయాలు సాధించిన ఒలింపిక్ మెడలిస్ట్ విజేందర్‌సింగ్ బెనివాల్ రకరకాల సందర్భాల్లో వ్యక్తిత్వవికాసం, ఫిట్‌నెస్‌కు సంబంధించి చెప్పిన విషయాలు కొన్ని ఆయన మాటల్లోనే...
►నాన్న బస్సు డ్రైవర్(హరియాణాలో) ఆదాయం అంతంత మాత్రమే. నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని ఆయనకు ఉండేది. నాకేమో బాక్సింగ్ అంటే ఇష్టం పెరిగింది. బాక్సింగ్‌లో నాకు ఓనమాలు దిద్దించిన తొలి గురువు మా అన్న మనోజ్. ‘మనకెందుకు బాక్సింగ్. బాగా చదువుకో’ అని నాన్న అనేవారు. ‘బాక్సింగ్ వద్దు క్రికెట్ నేర్చుకో’ అని కొందరు సలహా ఇచ్చేవారు. అయితే నేనేమీ లెక్కలు వేసుకోలేదు. బాక్సింగ్‌పై గట్టిగా మనసు పెట్టాను. బాక్సింగ్ సాధన చేస్తున్నప్పుడు గోడలపై కనిపించే ‘నో గట్స్ నో గ్లోరీ’ ‘నో పెయిన్, నో గెయిన్’లాంటి వాక్యాలు ఉత్తేజపరిచేవి.
►కష్టపడేతత్వం, క్రమశిక్షణ...ఇవి ఫిట్‌నెస్‌కు కీలకమైనవి. స్ట్రెచెస్, వామప్స్...ఇలా రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు వర్కవుట్లు చేస్తాను. బాడీ చురుగ్గా లేకపోతే, రోటిన్ బోర్ అనిపిస్తే స్కిప్కింగ్ చేస్తాను. దీన్ని ఎంజాయ్ చేస్తాను. ట్రెడ్‌మిల్ అనేది నా కోసం కాదు అనుకుంటాను. బహిరంగ ప్రదేశాలలో పరుగెత్తడానిక బాగా ఇష్టపడతాను. బ్రేక్‌ఫాస్ట్‌లో ఆమ్లెట్లు, సీజనల్ పండ్లు తీసుకుంటాను. లంచ్, డిన్నర్‌లలో రొట్టే, సబ్జీ, అన్నం, పప్పు, సాయంత్రం పాలు తీసుకుంటాను. రోజూ 4 నుంచి 5 లీటర్ల నీరు తాగు తాను. క్యాంప్‌లో మాత్రం నా డైట్ ప్రత్యేకంగా ఉంటుంది. గుడ్లు, ప్రొటిన్‌షేక్, చేపలు, చికెన్, బ్రౌన్‌రైస్...మొదలైనవి తీసుకుంటాను. స్వీట్లు తినడం నా బలహీనత, అయితే క్యాంప్‌లో ఉన్నప్పుడు వాటి గురించి కనీసం ఆలోచించను. మంచి ఫిట్‌నెస్‌కు మంచి నిద్ర కావాలి. ప్రతికూల ఆలోచనలను మనసులో నుంచి తీసేసి ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటే శరీరం మన మాట వింటుంది. పంజాబీ సంగీతం విని రాత్రి తొమ్మిది గంటలకు నిద్రపోతాను.
►బాక్సర్ శారీరకంగానే కాదు మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. రోజూ 30 నుంచి 50 నిమిషాల పాటు ధ్యానం చేస్తాను. ధ్యానం అనేది మనలోని అహాన్ని చంపేస్తుంది. గెలవగానే గెలుపు మైకంలో ‘నేనే గొప్ప’ అనే భ్రాంతి తప్ప ఏదీ కనిపించదు. నేను గెలిచినప్పుడు ‘గెలిచాను. ఓకే. దీన్ని నా మనసు నుంచి తీసేస్తున్నాను’ అనుకుంటాను. ఓడినప్పుడు ‘ఓడిపోయాను. దీన్ని నా మనసు నుంచి తీసేస్తున్నాను’ అనుకుంటాను. ‘నీ హృదయం యవ్వనమయమైతే వయసు అనేది సంఖ్య మాత్రమే అవుతుంది’ గురుదాస్ మాన్ పాటను తరచుగా గుర్తు చేసుకుంటాను.
►నేను నెంబర్‌వన్‌గా ఉండవచ్చు, ఉండక పోవచ్చు. కానీ ఎంత కష్టపడ్డామన్నదే నాకు ముఖ్యం. కలలు కనడం ఎంత మాత్రం తప్పు కాదు. అయితే అవి గాలిమేడలు కాకూడదు. ఎప్పుడూ వాస్తవం అనే పునాది మీదే మన పాదాలు ఉండాలి. ‘రాత్రికే రాత్రి విజయం నా సొంతం కావాలి’ అనుకునేవారు ఫీల్డ్‌లో నిలవ లేరు. స్టెప్–బై–స్టెప్ మాత్రమే ఏదైనా సాధించగలం.
Comments
Please login to add a commentAdd a comment