విజేందర్ ప్రత్యర్థి కెర్రీ హోప్
► జూలై 16న డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ బౌట్
► తొలి టికెట్ సెహ్వాగ్‌కు
న్యూఢిల్లీ: డబ్ల్యుబీవో ఆసియా టైటిల్ కోసం స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. జూలై 16న జరిగే ఈ బౌట్‌లో ఆస్ట్రేలియాకు చెందిన మాజీ యూరో చాంపియన్ కెర్రీ హోప్‌తో తను తలపడతాడు. స్థానిక త్యాగరాజ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. ప్రొఫెషనల్‌గా మారిన విజేందర్ ఓటమి లేకుండా ఆరు నాకౌట్ విజయాలతో జోరు మీదున్నాడు. మరోవైపు హోప్‌కు ఈ రంగంలో 12 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పటిదాకా తను 30 బౌట్లలో తలపడగా రెండు నాకౌట్‌లతో పాటు 23 విజయాలున్నాయి.
ఇక పోటీకి రెండు నెలల సమయం ఉండగా అప్పుడే మాటల యుద్ధం ప్రారంభమైంది. ‘విజేందర్ భారత్‌లో స్టార్ కావచ్చు కానీ నా వరకు ఓ బాక్సర్ మాత్రమే. ఏడాది క్రితమే విజేందర్ ప్రొగా మారాడు. నాకు 12 ఏళ్ల అనుభవం ఉంది. స్వదేశంలో ఒత్తిడంతా అతడి పైనే ఉంటుంది. ఇది నా విజయాన్ని సునాయాసం చేస్తుంది’ అని హోప్ అన్నాడు. అయితే బౌట్ జరిగే రోజు ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుందని విజేందర్ తేలిగ్గా తీసుకున్నాడు. మరోవైపు తొలి టికెట్‌ను తన స్నేహితుడు మాజీ క్రికెటర్ సెహ్వాగ్‌కు అందించాడు.