
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా తనకు ఆదర్శమని రాజకీయ నేతగా మారిన బాక్సర్ విజేందర్ సింగ్ చెప్పారు. ఆమె నిరాడంబరత తనను ఆకట్టుకుందని అన్నారు. ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్న విజేందర్ సింగ్ దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. తన ప్రత్యర్థులు..బీజేపీ పాతకాపు రమేష్ బిధూరిని మంచి వ్యక్తి కాదని, ఆప్ అభ్యర్థి రాఘవ్ ఛద్దాను బచ్చా అని విజేందర్ అభివర్ణించారు. ఇతర అభ్యర్థులతో పోటీయే లేదన్నారు. ‘నేనో రైతు కుటుంబానికి చెందిన బస్సు డ్రైవర్ కొడుకుని. సున్నా నుంచి మొదలుపెట్టా’ అని అన్నారు.
సీఎం కేజ్రీవాల్‌తో, ఆయన తప్పుడు వాగ్దానాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. పాఠశాల విద్యకు కొత్తరూపునిస్తామని, స్వచ్ఛమైన నీళ్లు అందజేస్తామని ఆప్ చెప్పింది కానీ.. 8వ తరగతి తర్వాత వెళ్లేందుకు విద్యార్థులకు బడి లేకుండా పోయింది.. వాటర్ ట్యాంకర్ ధర ఎంత ఉందో అందరికీ తెలిసిన విషయమేనని విమర్శించారు. తాను మొదటిసారి పోటీ చేస్తున్నప్పటికీ నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వమంటే మధ్యతరగతి ప్రజలు భయపడిపోతున్నారని, దక్షిణ ఢిల్లీలో భయంతో కూడిన వాతావరణానికి చరమగీతం పాడేందుకు తాను ప్రయత్నిస్తానని అన్నారు.