కొలంబో: ఓ ప్రత్యేక శైలితో బౌలింగ్ చేసే క్రికెటర్లు ఎవరంటే గుర్తొచ్చేది.. టీమిండియా యువ సంచలనం జస్ప్రీత్ బుమ్రా.. అతని బౌలింగ్ శైలే బ్యాట్స్‌మెన్‌ను తెగ ఇబ్బంది పెట్టడం చూశాం. అయితే బుమ్రా స్టైల్‌ను మించిండు.. శ్రీలంక అండర్-19 బౌలర్ కెవిన్ కాధ్‌ధిగోడా. తాజాగా అండర్-19 ఆసియా కప్‌లో ఆడిన ఈ బౌలర్ గురించే ఇప్పుడంతా చర్చ. కాకపోతే బుమ్రా పేస్ బౌలర్ అయితే కాధ్‌ధిగోడా స్పిన్ బౌలర్. అయితే ఇతని బౌలింగ్ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ పాల్ అడమ్స్, ఐపీఎల్ టీమ్ గుజరాత్ లయన్స్ ప్లేయర్ శివిల్ కౌశిక్‌ను గుర్తుచేస్తోందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా బౌలింగ్ చేయడం చాలా కష్టమని, శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా చాలా కష్టమని తెలిపారు.
శ్రీలంక-ఎ జట్టు ఆటగాడు దమిక సుదర్శన్.. కెవిన్ గురించి మాట్లాడుతూ.. ‘కెవిన్ శైలి చాలా ప్రత్యేకం. ఇలా వేయాలని అతనికి ఎవరూ సూచించలేదు. ఆ శైలి అతనికి సహజంగానే వచ్చింది. మొదట్లో బంతిని సరైన లెంగ్త్‌లో వేయడంలో ఇబ్బంది పడేవాడు. క్రమంగా దాన్ని మెరుగుపరుచుకున్నాడు’ అని తెలిపారు. మైదానంలో నేరుగా అతని శైలిని చూసిన అంపైర్ సరత్ అశోక మాట్లాడుతూ.. ‘విభిన్న శైలిలో బంతిని సరైన ప్రదేశాల్లో వేస్తున్నాడు. కెవిన్‌కు మంచి భవిష్యత్తు ఉంది’ అని పేర్కొన్నారు. ఇప్పటికే లంక నుంచి ముత్తయ్య మురళిధరన్, అజంతా మెండీస్‌లు అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. వారి బాటలో కెవిన్ పయనిస్తాడో లేదో చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment