కేపీకి మంచే జరిగిందా !
సాక్షి క్రీడా విభాగం
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వేటు వేయడం స్టార్ క్రికెటర్ పీటర్సన్‌కు మంచే చేసేట్లు కనిపిస్తోంది. ఈ నెల 12, 13 తేదీల్లో జరిగే ఐపీఎల్ వేలంలో పీటర్సన్‌ను తీసుకునేందుకు ఫ్రాంఛైజీలు బాగా ఆసక్తి కనబరుస్తున్నాయి. మొత్తం సీజన్‌కు అందుబాటులో ఉండటం, నాయకత్వం చేసే లక్షణాలు ఉండటంతో కెవిన్‌పై ఫ్రాంఛైజీలు దృష్టిపెట్టాయి. కేపీకి కళ్లు తిరిగే మొత్తం లభించినా ఆశ్చర్యపోనవసరం లేదని లలిత్ మోడీ అభిప్రాయపడ్డారు. గత సీజన్‌లో ఢిల్లీకి ఈ స్టార్ ఆటగాడు ప్రాతినిథ్యం వహించాడు.
‘అతడికి అద్భుతమైన నైపుణ్యం ఉంది. తన బ్యాటింగ్‌తో ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించగలడు. అలాగే జట్టులో కెప్టెన్‌గా స్ఫూర్తి నింపుతాడు’ అని కెవిన్ కోసం ఆసక్తి చూపుతున్న ఓ ఫ్రాంఛైజీ అధికారి చెప్పారు. ముంబై, చెన్నై, రాజస్థాన్ మినహా మిగిలిన అన్ని ఫ్రాంఛైజీల దగ్గరా భారీగా డబ్బు వేలానికి అందుబాటులో ఉంది. కాబట్టి తనకి మంచి ధర పలకొచ్చు.
వాళ్ల ఏడుపు లీగ్‌పైనే
పీటర్సన్ ఇంగ్లండ్ జట్టుకు దూరం కావడానికి ఐపీఎల్‌ను తప్పుపడుతున్నాయి ఇంగ్లండ్ పత్రికలు. ‘ద్వితీయశ్రేణి భారత బౌలర్లను చితకబాది డబ్బులు సంపాదించుకోవడం కోసం కెవిన్ కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు’ అని ఓ ఇంగ్లండ్ పత్రిక రాసింది. ‘భారత్‌లో సచిన్‌కు ఎలా దేవుడి హోదా ఉందో, ఇంగ్లండ్‌లో తనకూ అలాంటి హోదా కావాలని ఆశించారు. అదే తన పతనానికి కారణం’ అని మరో పత్రిక విశ్లేషించింది.