ఐపీఎల్‌కు పీటర్సన్ దూరం!
కౌంటీల కోసం
హోబర్ట్: ఇంగ్లండ్ జట్టుకు తిరిగి ఆడాలనే ఆలోచనలో ఉన్న కెవిన్ పీటర్సన్ ఈ ఏడాది కౌంటీల్లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నాడు. గత సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు కెప్టెన్‌గా ఉన్న పీటర్సన్‌ను ఇటీవలి ఆటగాళ్ల వేలంలో కొనేందుకు ఎవరూ పోటీపడలేదు. దీంతో సన్‌రైజర్స్ జట్టు అతడిని కనీస ధరకే కొనుగోలు చేసింది. అయితే కౌంటీ సీజన్... ఐపీఎల్ మ్యాచ్‌లు ఒకేసారి జరుగుతుండడంతో పీటర్సన్ లీగ్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాడు. ‘ప్రస్తుతానికైతే నా ఆలోచన అదే. తిరిగి అవకాశం లభిస్తే ఇంగ్లండ్ జట్టు తరఫున బరిలోకి దిగాలనే ఉంది.
ఈసీబీ కూడా ఈ విషయంలో ప్రోత్సహిస్తోంది’ అని పీటర్సన్ అన్నాడు. గతేడాది ఈసీబీచే వివాదాస్పద రీతిలో తను ఉద్వాసనకు గురయ్యాడు. అయితే ఈ మే నెలలో బోర్డు సీఈవోగా బాధ్యతలు తీసుకోనున్న టామ్ హారిసన్, చైర్మన్‌గా రానున్న కోలిన్ గ్రేవ్స్... పీటర్సన్ పునరాగమనంపై సానుకూలంగా ఉండడం అతనికి కలిసొచ్చే అంశం. ఆరు కౌంటీ జట్లు ఇతని కోసం చూస్తున్నా.. కెవిన్ సర్రే కౌంటీకి ఆడే అవకాశాలున్నాయి.