
న్యూఢిల్లీ: చాన్నాళ్ల తర్వాత టైటిల్ బాట పట్టాలనుకున్న భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఆశలపై విక్టర్ అక్సెల్సన్ నీళ్లుచల్లాడు. దీంతో ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలుగుతేజం రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఫురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో మాజీ చాంపియన్ శ్రీకాంత్ 7–21, 20–22తో డెన్మార్క్‌కు చెందిన రెండో సీడ్ అక్సెల్సన్ చేతిలో పరాజయం చవి చూశాడు. 17 నెలల తర్వాత ఓ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఈవెంట్‌లో ఫైనల్ చేరిన మూడో సీడ్ శ్రీకాంత్ టైటిల్ వేటలో చతికిలబడ్డాడు. తొలి గేమ్‌లో లెక్కలేనన్ని అనవసర తప్పిదాలు చేయడంతో పాటు ప్రత్యర్థి జోరుకు తలవంచాడు. 11–7తో భారత ఆటగాడిపై ఆధిక్యం కనబరిచిన అక్సెల్సన్ అదే ఊపుతో వరుసగా పాయింట్లు సాధించాడు. ఈ గేమ్‌లో రిటర్న్, బ్యాక్‌హ్యాండ్ షాట్లు నేర్పుగా ఆడటంలో శ్రీకాంత్ విఫలమయ్యాడు. ఇదే అదనుగా డెన్మార్క్ స్టార్ 21–7తో గేమ్‌ను కైవసం చేసుకున్నాడు.
అయితే రెండో గేమ్‌లో మాత్రం శ్రీకాంత్ పుంజుకున్నాడు. ఒక దశలో ఆరంభంలో 1–5తో వెనుకబడినా... తర్వాత వరుసగా మూడు పాయింట్లు సాధించి టచ్‌లోకి వచ్చాడు. విరామ సమయానికి 9–11తో ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించాడు. ఆ తర్వాత ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. దీంతో 12–12 వద్ద స్కోరు సమం చేసిన భారత ఆటగాడు 14–13తో అక్సెల్సన్‌పై ఆధిక్యంలోకి వచ్చాడు. స్మాష్‌లతో మరో రెండు పాయింట్లు సాధించాడు. అయితే రిటర్న్ షాట్లను నేర్పుగా ఆడగలిగే అక్సెల్సన్ మరో గేమ్‌దాకా పొడిగించకుండానే వరుస పాయింట్లతో గేమ్‌ను, మ్యాచ్‌ను ముగించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) గెలుచుకుంది. ఫైనల్లో నాలుగో సీడ్ రచనోక్ 21–15, 21–14తో మూడో సీడ్ హి బింగ్ జియావో (చైనా)పై విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment