
పోరాడి ఓడిన శ్రీకాంత్
కౌలూన్: అద్భుతం చేయకున్నా ఆకట్టుకున్నాడు. హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ గౌరవప్రదంగా నిష్ర్కమించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ పదో ర్యాంకర్ శ్రీకాంత్ 17-21, 21-19, 6-21తో టాప్ సీడ్, ప్రపంచ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు.
64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ తొలి రెండు గేముల్లో తన ప్రత్యర్థికి గట్టిపోటీనిచ్చాడు. అయితే నిర్ణాయక మూడో గేమ్ మొదలయ్యే సమయానికి పూర్తిగా అలసిపోయిన ఈ హైదరాబాద్ కుర్రాడు మ్యాచ్‌పై ఆశలు వదులుకున్నాడు. ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్‌ను వరుస గేముల్లో ఓడించిన చెన్ లాంగ్ కీలకమైన మూడో గేమ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని చలాయించాడు.
పదునైన స్మాష్‌లు, డ్రాప్ షాట్‌లతో విజృంభించి... ఒకసారి వరుసగా ఐదు పాయింట్లు, మరోసారి ఏడు పాయింట్లు, ఇంకోసారి నాలుగు పాయింట్లు సంపాదించి శ్రీకాంత్‌కు తేరుకునే అవకాశం ఇవ్వలేదు. సెమీస్‌లో ఓడిన శ్రీకాంత్‌కు 5,075 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 13 వేలు)తోపాటు 6,420 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.