ముంబై : ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ ప్రతి సీజన్‌లో తన వైవిధ్యమైన ఆటతో అభిమానులను కట్టిపడేస్తాడు. అది ఫీల్డింగ్.. బ్యాటింగ్.. బౌలింగ్ ఏదైనా తన వైవిధ్యమైన ఆటతీరుతో ప్రతీసీజన్‌లో వార్తల్లో నిలుస్తాడు. అయితే తాజా సీజన్ ప్రారంభమై నాలుగు మ్యాచ్‌లైనా పోలార్డ్ మెరుపులు కనిపించక అభిమానులు దిగాలు చెందారు. అయితే బుధవారం చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన మార్క్ ఫీల్డింగ్‌తో జిగేల్‌మన్నాడు. చెన్నై కీలక ఆటగాడైన సురేశ్ రైనాను సూపర్ మ్యాన్ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చి ముంబై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ ఆరంభంలో తడబడింది. వరుస ఓవర్లలో రాయుడు ఖాతా తెరువకుండానే, వాట్సన్ (5) సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. ఆరుకే ఇద్దరు ఓపెనర్లను కోల్పోయిన సూపర్‌కింగ్స్‌ను కాసేపు రైనా, జాదవ్ నడిపించారు. ఈ జోడి క్రీజ్‌లో పాతుకుపోతున్న దశలో రైనా (15 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్)ను పొలార్డ్ తన అద్భుత క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. బెహ్రెన్‌డార్ఫ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఆఖరి బంతిని రైనా పాయింట్ బౌండరీ దిశగా భారీ షాట్ బాదాడు. కానీ అక్కడ పొడగరి పొలార్డ్ ఒంటి చేత్తో వెనక్కి డైవ్ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. దీంతో దాదాపు సిక్స్ అని భావించిన రైనా నిరాశతో క్రీజును వీడాడు. ఈ క్యాచ్ చెన్నై విజయవకాశాలను దెబ్బతీసింది. చివరకు 37 పరుగుల తేడాతో తొలిపరాజయం చవి చూడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఈ క్యాచ్ అనంతరం ‘నేనంటే ఇదిరా’ అన్నట్టు పొలార్డ్ చేసిన సైగ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పోలార్డ్ అద్భుత ఫీల్డింగ్‌ను మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు సైతం కొనియాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment