దుబాయ్: ఐపీఎల్ టోర్నీ చరిత్రలో అత్యంత పేలవ ప్రదర్శన చేసిన సూపర్ కింగ్స్ తాజా సీజన్‌లో ప్లే ఆప్స్‌కు దూరమైంది. శుక్రవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క సామ్ కరన్ మినహా, మిగతా సభ్యులంతా విఫలమయ్యారు. అతని ఒంటరి పోరుతోనే చెన్నై సెంచరీ మార్కును దాటగలిగింది. ప్రత్యర్థిని 100 పరుగుల లోపే కట్టడి చేయాలని భావించినా సామ్ కరన్ అద్భుత ప్రదర్శనతో అది సాధ్యం కాలేదని ముంబై కెప్టెన్ కీరన్ పొలార్డ్ చెప్పుకొచ్చాడు. కరన్ కొరకరాని కొయ్యలా మారడంతో చెన్నై ఆ మాత్రం పరుగులు చేయగలిగిందని అన్నాడు.
తొలి పవర్ ప్లే ముగిసే సమయానికి టాప్ 5 వికెట్లను కూల్చడం ఆనందాన్నిచ్చిందని పొలార్డ్ తెలిపాడు. ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా అదిరిపోయే బౌలింగ్‌తో చెన్నై ఆటగాళ్లు తేరుకోలేకపోయారని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో వ్యాఖ్యానించాడు. సమష్టి ప్రదర్శనతో ముంబై గెలిచిందని తెలిపాడు. కాగా, 5 వికెట్లు కోల్పోయి అత్యల్ప స్కోర్ నమోదు దిశగా పయనిస్తున్న సీఎస్‌కేను సామ్ కరన్ ఆ ప్రమాదం నుంచి తప్పించాడు. ఆరో ఓవర్ మూడో బంతికి క్రీజ్‌లోకి వచ్చిన అతను బౌలర్లందరినీ సమర్థంగా ఎదుర్కొంటూ చివరి బంతి వరకు పట్టుదలగా నిలిచి పరుగులు రాబట్టాడు.
రాహుల్ చహర్, కూల్టర్‌నైల్ వరుస ఓవర్లలో ఒక్కో సిక్స్ కొట్టి అతను జోరును ప్రదర్శించాడు. అద్భుత గణాంకాలతో చెన్నై ఆటగాళ్లకు చెమటలు పట్టంచిన బౌల్ట్ బౌలింగ్‌లోనూ పరుగులు రాబట్టాడు. బౌల్ట్ వేసిన 20వ ఓవర్లో కరన్ బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. అప్పటివరకు 3 ఓవర్లలో 5 పరుగులే ఇచ్చిన బౌల్ట్ గణాంకాలు ఈ ఓవర్‌తో మారిపోయాయి. ఈ ఓవర్లో మూడు ఫోర్లు బాదిన కరన్ 46 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి బంతికి అద్భుత యార్కర్‌తో కరన్‌ను బౌల్డ్ చేసి బౌల్ట్ సంతృప్తి చెందాడు.
ఇక 114 పరుగుల లక్ష్యాన్ని ముంబై 12.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (37 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), డికాక్ (37 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచారు. 11 మ్యాచ్‌లలో ఎనిమిదింట పరాజయం పాలైన చెన్నై జట్టు ఇక ముందుకు వెళ్లేందుకు అన్ని దారులు మూసుకుపోయాయి. కాగా, ఈ విజయంతో ముంబై ఢిల్లీని వెనక్కి నెట్టి తొలి స్థానాన్ని ఆక్రమించింది. గాయం కారణంగా రోహిత్ ఈ మ్యాచ్‌కు దూరమవడంతో పొలార్డ్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.
Comments
Please login to add a commentAdd a comment