కుప్పకూలిన కింగ్స్ పంజాబ్
► ఆఖరి పోరులో విఫలమైన కింగ్స్
పుణె: మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో కింగ్స్ పంజాబ్-రైజింగ్ పుణె జట్లు మధ్య జరుగుతున్న అమీతుమీ మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ 73 పరుగులకే కుప్పకూలి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ప్లే ఆఫ్ అర్హత కోసం జరుగుతున్న ఈ మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ కనీస పోరాటాన్ని ప్రదర్శించలేకపోయింది. పుణే బౌలర్లు శార్ధుల్ టాకుర్ (3/19), జయదేవ్ ఉనద్కట్ (2/12), క్రిస్టియన్ (2/10), ఆడమ్ జంపా(2/22) లు సమిష్టిగా రాణించడంతో పంజాబ్ బ్యాట్స్ మన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కింగ్స్ పంజాబ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బతగిలింది.
పరుగుల ఖాతా తెరవకముందే గప్టిల్(0) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ వృధ్దిమాన్ సాహా, షాన్ మార్ష్ తో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా టాకుర్ మార్ష్(10) వికెట్ తీసి దెబ్బకొట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఏ ఒక్క బ్యాట్స్ మన్ కుదురుకోలేకపోయాడు. దీంతో కింగ్స్ పంజాబ్ పవర్ ప్లే ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. అక్సర్ పటేల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా క్రిస్టియన్ అడ్డుపడ్డాడు. పంజాబ్ బ్యాట్స్ మెన్స్ లో మాక్స్ వెల్, గప్టిల్ డకౌట్ అవ్వగా, అక్సర్(22), సాహా(13), మార్ష్(10), స్వప్నిల్(10) లు మినహా మిగతా అంతా సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యారు. దీంతో కింగ్స్ పంజాబ్ 15.5 ఓవర్లకే ఆలౌట్ అయింది.