పంజాబ్ మళ్లీ గెలుపు బాట పట్టింది. గత మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన పంజాబ్.. ఈసారి లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో సమష్టి ప్రదర్శనతో ముంబైని చిత్తు చేసింది. కింగ్స్ ఎలెవన్ బ్యాట్స్‌మెన్ మయాంక్, గేల్, రాహుల్ సమష్టిగా రాణించడంతో రోహిత్‌సేన వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. అంతకు ముందు బ్యాటింగ్‌లో డికాక్ అర్ధసెంచరీ చేసినా పంజాబ్ బౌలర్లు చివర్లో కట్టడి చేయడంతో ముంబై సాధారణ స్కోరుకు పరిమితమైంది.
మొహాలి: ముందుగా బౌలర్లు, అనంతరం బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. క్వింటన్ డి కాక్ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ చేయగా... కెప్టెన్ రోహిత్ శర్మ (18 బంతుల్లో 32; 5 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. అనంతరం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 18.4 ఓవర్లలో 2 వికెట్లకు 177 పరుగులు చేసి గెలుపొందింది. కేఎల్ రాహుల్ (57 బంతుల్లో 71; 6 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడగా... గేల్ (24 బంతుల్లో 40; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మయాంక్ అగర్వాల్ (21 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిని ప్రదర్శించారు.
డికాక్ దూకుడు
పంజాబ్ కెప్టెన్ అశ్విన్ వేసిన తొలి ఓవర్‌లోనే బౌండరీతో డికాక్ ఖాతా తెరిచాడు. అతను వేసిన మరో రెండు ఓవర్లలోనూ ఒక్కో బౌండరీ సాధించి జోరు కనబరిచాడు. మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో ఓవరాల్‌గా మూడు బౌండరీలు బాదిన డికాక్... షమీ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లతో హోరెత్తించాడు. ఈ క్రమంలో 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఫ్ స్టంప్‌పై పడిన బంతిని ముందుకొచ్చి స్క్వేర్‌లెగ్ మీదుగా కొట్టిన భారీ సిక్స్ అతని ఇన్నింగ్స్‌లో హైలైట్. దీని తర్వాత మరుసటి బంతికే అతను వికెట్ల ముందు షమీకి దొరికిపోయాడు.
రాణించిన రోహిత్
తొలి రెండు మ్యాచ్‌ల్లోలాగే రోహిత్ శర్మ ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. షమీ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, టై బౌలింగ్‌లో మరో 3 బౌండరీలు సాధించి అతను జోరు కనబరిచాడు. క్రీజులో పాతుకుపోతున్న రోహిత్‌ను విలోన్ ఎల్బీ చేశాడు. కానీ రివ్యూలో బంతి వికెట్లకు దూరంగా వెళ్తున్నట్లు కనిపించింది.
హార్దిక్ జోరు
తొలి పది ఓవర్లలో 91 పరుగులు చేసిన ముంబై... మంచి హిట్టర్లున్నప్పటికీ రెండో అర్ధభాగంలో ధాటిగా ఆడలేకపోయింది. వికెట్ స్లోగా మారడంతో 85 పరుగులే జతచేయగలిగింది. హార్దిక్ ధాటిగా ఆడటంతో ఆమాత్రమైన స్కోరు సాధించగలిగింది. విలోన్ ఓవర్లలో రెండు ఫోర్లు బాదిన హార్దిక్... ఇన్నింగ్స్ చివరి ఓవర్ రెండో బంతిని సిక్స్‌గా మలిచాడు. అదే జోరులో మరో బౌండరీ సాధించబోయి డీప్ మిడ్‌వికెట్‌లో మన్‌దీప్‌కు క్యాచ్ ఇచ్చాడు.
గేల్ దుమారం ...
తొలి ఓవర్‌లోనే ఎల్బీ అప్పీల్ నుంచి తప్పించుకున్న గేల్... మెక్లీనగన్ బౌలింగ్‌లో రెండు వరుస సిక్సర్లతో తన ఉనికిని చాటుకున్నాడు. అనంతరం మలింగ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన గేల్... హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో మరో రెండు భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కృనాల్ వేసిన మరుసటి ఓవర్‌లోనే లాంగాన్‌లో హార్దిక్ క్యాచ్ అందుకోవడంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది.
మయాంక్ విజృంభణ
బంతిని బాదటమే లక్ష్యమన్నట్లుగా బరిలోకి దిగిన మయాంక్ తాను ఎదుర్కొన్న రెండో బంతినే బౌండరీకి తరలించాడు. మార్కండే ఓవర్‌లో మరో రెండు ఫోర్లతో చెలరేగాడు. కృనాల్ ఓవర్లలో మరో రెండు సిక్స్‌లు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే చివరికి అతని చేతికే చిక్కి నిష్క్రమించాడు.
రాహుల్ సూపర్ కూల్ ఇన్నింగ్స్
గేల్, మయాంక్ ధాటిగా ఆడుతున్న సమయంలో సింగిల్స్‌కే పరిమితమైన రాహుల్... హార్దిక్ వేసిన ఇన్నింగ్స్ పదిహేనో ఓవర్‌లో ఒక్కసారిగా జూలు విదిల్చాడు. తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. తర్వాత మరో రెండు ఫోర్లు బాది 19 పరుగులు రాబట్టాడు. ఈ ఓవరే మ్యాచ్ గమనాన్ని మార్చింది. అంతకుముందు వరకు 36 బంతుల్లో 56 పరుగులుగా ఉన్న విజయ సమీకరణం రాహుల్ దెబ్బకు 30 బంతుల్లో 37గా మారింది. మలింగ బౌలింగ్‌లో మరో ఫోర్ బాదిన రాహుల్ 46 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. తర్వాత మరో 3 బౌండరీలతో జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు.
‘మయాన్కడింగ్‘ జరగలేదు!
ఐపీఎల్‌లో మరో ‘మన్కడింగ్’ త్రుటిలో తప్పిపోయింది. అయితే ఈసారి వివాదం కాకుండా నిజంగా క్రీడాస్ఫూర్తి ప్రదర్శించిన బౌలర్‌నే మనం ప్రశంసించాలి. ఎందుకంటే పంజాబ్ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్‌ను మన్కడింగ్ చేసే అవకాశం ఉన్నా... ముంబై బౌలర్ కృనాల్ పాండ్యా ఆ పని చేయలేదు. పంజాబ్ ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఈ ఘటన జరిగింది ‘నువ్వు చాలా ముందుకెళ్లావు, వెనక్కి వచ్చేయ్’ అంటూ కేవలం హెచ్చరికతో కృనాల్ వదిలి పెట్టాడు! మయాంక్ ఇలా చేయడం కొత్త కాదు. కోల్‌కతాలో మ్యాచ్‌లోనూ బంతి బౌలర్ చేతినుంచి దాటక ముందే అతను పదే పదే ముందుకెళ్లటం కనిపించింది. ‘మన్కడింగ్’తో చర్చకు దారి తీసిన అశ్విన్ జట్టు సహచరుడే ఈసారి దాని నుంచి తప్పించుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment