ముంబై: పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌పై వీర విజృంభణతో ముంబై గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించిన తాత్కాలిక కెప్టెన్ పొలార్డ్... తమ గెలుపును భార్యకు అంకితమిస్తున్నానని చెప్పాడు. బుధవారం పొలార్డ్ భార్య జెనా అలీ పుట్టిన రోజు కావడం విశేషం. రోహిత్ శర్మ గాయం కారణంగా మ్యాచ్‌కు సారథ్యం వహించిన పొలార్డ్ క్లిష్ట పరిస్థితుల నుంచి జట్టును విజయం వైపు నడిపించాడు. జట్టు గెలుపు అనంతరం అతని కుమారుడు కైడెన్ పొలార్డ్ సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ తనకు బలంగా బాదగలిగే శక్తి ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు.
‘నేను భగవంతునితో పాటు నా భార్యకు ఈ విజయాన్ని అంకితమిస్తున్నా. ఆమె పుట్టిన రోజు నాడే నేను కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాను. చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నాడు. వాంఖెడేలో బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతానన్న పొలార్డ్ ఎక్కువ బంతులు ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వెళ్లానని తెలిపాడు. ‘మేం బ్యాటింగ్ చేసే సమయంలో పిచ్ బౌలర్ల సహకరించకపోవడం మాకు మేలు చేసింది. దీంతో మా పని సులువైంది. చివర్లో కాస్త ఉత్కంఠ రేగినా ఫలితం మాకు అనుకూలంగా వచ్చింది’ అని పొలార్డ్ వివరించాడు. తదుపరి గేమ్‌కు తమ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడని చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment