డివిలియర్స్ మోత సరిపోలేదు
46 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లతో 89 నాటౌట్
► పంజాబ్ చేతిలో బెంగళూరు ఓటమి
► రాణించిన ఆమ్లా, మ్యాక్స్‌వెల్
ఇండోర్: పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు తమ జోరును మరింత పెంచింది. ఐపీఎల్ పదో సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఓపెనర్ హషీమ్ ఆమ్లా (38 బంతుల్లో 58 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీకి తోడు కెప్టెన్ మ్యాక్స్‌వెల్ (22 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మరోసారి చెలరేగగా... సోమవారం హోల్కర్ మైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. క్రిస్ గేల్ స్థానంలో జట్టులోకి వచ్చిన డివిలియర్స్ (46 బంతుల్లో 89 నాటౌట్; 3 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ బెంగళూరు జట్టుకు ఉపయోగపడలేకపోయింది. పొదుపుగా బౌలింగ్ చేసిన పంజాబ్ స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
సిక్సర్ల వర్షం...
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేసింది. ప్రారంభం నుంచే ఈ జట్టు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడింది. తొలి ఓవర్‌లో వాట్సన్ అవుటయ్యాక డివిలియర్స్ క్రీజ్‌లోకి రాగా... మరోవైపు విష్ణు వినోద్, కేదార్ జాదవ్ వెంటవెంటనే అవుటవ్వడంతో బెంగళూరు పవర్‌ప్లేలో 23 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో మన్‌దీప్ సింగ్ (34 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి డివిలియర్స్ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.
14వ ఓవర్‌లో మన్‌దీప్ అవుట్ కావడంతో డివిలియర్స్‌తో నాలుగో వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 17వ ఓవర్ నుంచి బెంగళూరు ఆటలో వేగం పెరిగింది. డివిలియర్స్ ఓ భారీ సిక్సర్‌తో 34 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. మోహిత్ వేసిన 18వ ఓవర్‌లో స్టువర్ట్ బిన్నీ (20 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఓ సిక్స్, ఫోర్ కొట్టగా డివిలియర్స్ ఓ సిక్స్ జత చేయడంతో 19 పరుగులు వచ్చాయి.
ఇక 19వ ఓవర్‌లో డివిలియర్స్ తన ట్రేడ్‌మార్క్ షాట్లతో రెచ్చిపోయి వరుసగా 4,6,6 బాదడంతో మరో 19 పరుగులు వచ్చాయి. అయితే మోహిత్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో తొలి నాలుగు బంతుల్లో రెండు పరుగులే ఇచ్చినా ఆఖర్లో డివిలియర్స్ రెండు భారీ సిక్సర్లు బాదడంతో జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.
ఆమ్లా నిలకడ
149 పరుగుల స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన పంజాబ్ 14.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి గెలిచింది. లక్ష్యం తక్కువగానే ఉన్నా తమ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. మూడో ఓవర్‌లో సిక్స్ కొట్టిన మనన్ వోహ్రా ఆ తర్వాత ఓవర్‌లో మూడు ఫోర్లు బాదడంతో ఐదు ఓవర్లు ముగిసేసరికి 50 పరుగులు జట్టు ఖాతాలో చేరాయి.
అయితే ఆరో ఓవర్‌లో మిల్స్ ఓపెనింగ్ జోడిని విడదీయడంతో తొలి వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అక్షర్ (9) అవుటయ్యాక... ఆమ్లా, మ్యాక్స్‌వెల్ జోడి బెంగళూరు బౌలర్లను ఆటాడుకుంది. ఇద్దరు ఆటగాళ్లు బౌండరీలతో విరుచుకుపడటం తో పరుగులు ధారాళంగా వచ్చా యి. 32 బంతుల్లో ఆమ్లా అర్ధ సెంచరీ చేశాడు. 14వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన మ్యాక్సీ ఆ తర్వాత ఓవర్‌లో భారీ సిక్స్‌తో జట్టుకు విజయాన్ని అందించా డు. ఆమ్లా, మ్యాక్స్‌వెల్ మూడో వికెట్‌కు అజేయంగా 72 పరుగులు జోడించారు.
స్కోరు వివరాలు
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్: వాట్సన్ (బి) అక్షర్ 1; వినోద్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) సందీప్ 7; డివిలియర్స్ నాటౌట్ 89; కేదార్ జాదవ్ ఎల్బీడబ్ల్యూ (బి) వరుణ్ ఆరోన్ 1; మన్‌దీప్ (సి) సాహా (బి) వరుణ్ ఆరోన్ 28; స్టువర్ట్ బిన్నీ నాటౌట్ 18; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 148.
వికెట్ల పతనం: 1–2, 2–18, 3–22, 4–68.
బౌలింగ్: అక్షర్ పటేల్ 4–0–12–1, సందీప్ శర్మ 4–0–26–1, మోహిత్ శర్మ 4–0–47–0, వరుణ్ ఆరోన్ 4–0–21–2, నటరాజన్ 1–0–13–0, స్టోయినిస్ 3–0–28–0.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: వోహ్రా ఎల్బీడబ్ల్యూ (బి) మిల్స్ 34; ఆమ్లా నాటౌట్ 58; అక్షర్ (బి) చహల్ 9; మ్యాక్స్‌వెల్ నాటౌట్ 43; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (14.3 ఓవర్లలో 2 వికెట్లకు) 150.
వికెట్ల పతనం: 1–62, 2–78.
బౌలింగ్: స్టాన్‌లేక్ 4–0–41–0, ఇక్బాల్ అబ్దుల్లా 2–0–19–0, వాట్సన్ 2–0–28–0, మిల్స్ 2–0–22–1, చహల్ 3.3–0–29–1, పవన్ నేగి 1–0–7–0.