న్యూఢిల్లీ: భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే కొత్త ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. యూఎస్‌ఏ క్రికెట్ జట్టుకు తాత్కాలిక కోచ్‌గా మోరే నియమించబడ్డాడు. త్వరలోనే పబుడు దసనాయకే స్థానంలో మోరే కోచింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు. శ్రీలంక, కెనడా జట్లకు ప్రాతినిథ్య వహించిన 49 ఏళ్ల దసనాయకే కోచింగ్ కాంట్రాక్ట్ మార్చి 2019 వరకూ ఉండగా, దాన్ని ఈ ఏడాది డిసెంబర్ వరకూ పొడిగించారు. కాగా, యూఎస్‌ఏ క్రికెట్ బోర్డుతో దసనాయకేకు విభేదాలు రావడంతో తన కోచింగ్ పదవికి రాజీనామా చేశారు. దాంతో మోరేను తాత్కాలిక కోచ్‌గా నియమిస్తూ యూఎస్‌ఏ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
భారత వికెట్ కీపర్‌గా, సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా పని చేసిన అనుభవం ఉన్న మోరేను యూఎస్‌ఏ క్రికెట్ కోచ్‌గా ఎంపిక చేసింది. భారత్ తరఫున 49 టెస్టు మ్యాచ్‌లు, 94 వన్డేలు ఆడిన మోరే.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు వికెట్ కీపింగ్ కన్సల్టెంట్‌గా కూడా పని చేశారు.
ఇదిలా ఉంచితే, ఈ ఏడాది ఏప్రిల్‌లో యూఎస్‌ఏ జట్టుకు వన్డే హోదా వచ్చిన సంగతి తెలిసిందే. వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజిన్-2లో హాంకాంగ్‌పై 84 పరుగుల తేడాతో గెలవడంతో యూఎస్‌ఏకు వన్డే హోదా లభించింది. అంతకుముందు 2004లో యూఎస్‌ఏ ఒకసారి వన్డే హోదాను దక్కించుకున్నా ఆ తర్వాత దాన్ని కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment