న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్ భవిష్యత్‌పై కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ నిర్వహణ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సొంతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీలులేదని స్పష్టం చేశారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టాక... కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే ఐపీఎల్ జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘ కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితుల ఆధారంగా భారత్‌లో ఐపీఎల్ నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. క్రీడా టోర్నమెంట్‌లు నిర్వహించాలనే ఏకైక కారణంతో ప్రజలందరి ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేము. ప్రస్తుతం మా దృష్టంతా కరోనా కట్టడిపైనే ఉంది’ అని కిరణ్ రిజిజు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్–నవంబర్‌లలో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్ వాయిదా పడితే... అవే తేదీల్లో భారత్‌లో ఐపీఎల్ టోర్నీ నిర్వహించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment