
క్రికెటర్లకు దేశభక్తి లేదు!
దర్భాంగా(బీహార్): ఇంగ్లండ్ లో టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా ఆటగాళ్లపై మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు భారత మాజీ క్రికెటర్లు టీమిండియా ఆటతీరుపై మండిపడుతుంటే తాజాగా ఆ జాబితాలో కీర్తి ఆజాద్ చేరిపోయారు. టీమిండియా ఆటగాళ్లలో నిబద్ధత లోపించడమే కాకుండా, వారిలో అసలు దేశభక్తి అనేది లేకుండా పోయిందని ఆజాద్ విమర్శలకు దిగాడు. భారత్ లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లకు మాత్రమే ఆటగాళ్లు అధిక ప్రాధాన్యత ఇచ్చి, దేశం తరుపున ఆడటానికి వచ్చేసరికి మిన్నుకుండు పోతున్నారని ఎద్దేవా చేశారు.
ఇంగ్లండ్ లో 3-1 తేడాతో టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన అనంతరం బీసీసీఐ చేపట్టిన ప్రక్షాళనతో భారీ మార్పులు వస్తాయని తాను అనుకోవడం లేదన్నారు. మరో మూడు రోజుల్లో ఆరంభం కానున్న వన్డే సిరీస్ కు మాజీ క్రికెటర్ రవిశాస్త్రిని టీమిండియా డైరెక్టర్ గా నియమించడంతో జట్టులో ఆకస్మిక మార్పులు ఏమీ రావన్నాడు. టీమిండియాకు తాత్కాలిక డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రవిశాస్త్రి నియామకంతో శాశ్వత పరిష్కారం లభించినట్లు కాదన్నాడు. అతను ఈ వన్డే సిరీస్ కు జట్టులోని చిన్నపాటి లోపాల్ని మాత్రమే సరిచేయగలడని ఆజాద్ తెలిపారు. ఒక గోడపై వచ్చిన పగుళ్లను కనబడకుండా ఉండేందుకు చేసే పనుల మాదిరిగా అతని నియామకం ఉందన్నాడు. టీమిండియా ఆటగాళ్లు పూర్తి నిబద్ధతతో ఆడినప్పుడే మాత్రమే జట్టు విజయాల బాట పడుతుందని స్పష్టం చేశాడు.1983 వరల్డ్ కప్ గెలిచిన భారత టీంలో సభ్యుడైన కీర్తి ఆజాద్.. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు.