రప్ఫాడించిన కేకేఆర్..
బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో కోల్ కతా నైట్ రైడర్స్ మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ లక్ష్యాలను సైతం సునాయాసంగా ఛేదిస్తున్న కోల్ కతా నైట్ రైడర్స్.. తాజాగా రాయల్ చాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 159 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రప్ఫాడించింది. ఆర్సీబీ విసిరిన లక్ష్యాన్ని 15.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి సాధించిన కోల్ కతా మరోసారి తమ బ్యాటింగ్ లో బలాన్ని చాటుకుంది. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్ లకు దూరంగా ఉన్న కోల్ కతా ఓపెనర్ క్రిస్ లిన్(50;22 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకోగా, మరో ఓపెనర్ సునీల్ నరైన్(54;17 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) తో చెలరేగి ఆడాడు. ఈ జోడి తొలి వికెట్ కు 105 పరుగులు జోడించడంతో కోల్ కతా విజయం నల్లేరుపై నడకలా సాగింది. వీరిద్దరూ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆపై గ్రాండ్ హోమ్(31), గౌతం గంభీర్(14)లు మిగతా పనిని పూర్తి చేయడంతో ఇంకా 29 బంతులుండగానే కోల్ కతా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో కోల్ కతా నైట్ రైడర్స్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్ కు చేరువైంది.
రెండు రికార్డులు..
ఈ మ్యాచ్ లో రెండు రికార్డులు నమోదయ్యాయి. ఒకటి సునీల్ నరైన్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కాగా, మరొకటి పవర్ ప్లేలో అత్యధిక పరుగులు రికార్డు. తొలుత అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. నరైన్ 15 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధ శతకం సాధించి ఫాస్టెస్ హాఫ్ సెంచరీ రికార్డు సాధించాడు.. అంతకుముందు 2014లో యూసఫ్ పఠాన్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా యూసఫ్ పఠాన్ సరసన నిలిచాడు. ఈ ఇద్దరూ కోల్ కతా ఆటగాళ్లే కావడం ఇక్కడ మరోవిశేషం. ఈ మ్యాచ్ లో నరైన్ దూకుడుగా ఆడటంతో కోల్ కతా ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 105 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పవర్ ప్లే స్కోరుగా రికార్డులకెక్కింది. అయితే 17 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసిన తరువాత నరైన్ తొలి వికెట్ గా అవుటయ్యాడు.
అంతకుముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ ఆది నుంచి తడబడుతూనే బ్యాటింగ్ చేసింది. క్రిస్ గేల్(0), కోహ్లి(5), ఏబీ డివిలియర్స్(10) వికెట్లను ఆదిలోనే కోల్పోయిన ఆర్సీబీని మన్ దీప్ సింగ్ ఆదుకున్నాడు. మన్ దీప్(52;43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా బ్యాటింగ్ చేయగా, ఆపై ట్రావిస్ హెడ్(75 నాటౌట్;47 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఈ జోడి 71 పరుగుల్నిజత చేసి ఆర్సీబి ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ట్రావిస్ హెడ్ తన జోరును కడవరకూ కొనసాగించాడు. చివరి ఓవర్ లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ సాధించడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.