సన్ 'రైజ్' కాలేదు..
కోల్ కతా:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. గత మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైన సన్ రైజర్స్.. తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో సైతం ఓటమి చెందింది. శనివారం ఈడెన్ గార్డెన్ లో జరిగిన మ్యాచ్ లో అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ విఫలమైన సన్ రైజర్స్ 17 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. గత ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోని సన్ రైజర్స్ సమష్టిగా పోరాడటంలో విఫలమైంది.
కోల్ కతా విసిరిన 173 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 155 పరుగులకే పరిమితమైంది. సన్ రైజర్స్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్(26), శిఖర్ ధావన్(23), హెన్రిక్స్(13), యువరాజ్ సింగ్(26), దీపక్ హుడా(13), కట్టింగ్(15)లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు.కోల్ కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి సన్ రైజర్స్ ను నిలువరించారు. కోల్ కతా బౌలర్లలో క్రిస్ వోక్స్ రెండు వికెట్లు సాధించగా,బౌల్ట్, సునీల్ నరైన్, కుల్దీప్ యాదవ్, యూసఫ్ పఠాన్ లు తలో వికెట్ తీసి జట్టు విజయంలో సహకరించారు.
అంతకుముందు టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదారాబాద్ తొలుత కోల్ కతా ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దాంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా 20.0 ఓవర్లలో ఆరు వికెట్లకు 172 పరుగులు చేసింది.ఓపెనర్లు సునీల్ నరైన్(6), గౌతం గంభీర్(15) వికెట్లను తొందరగా చేజార్చుకున్నప్పటికీ రాబిన్ ఊతప్ప(68;39 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్లు), మనీష్ పాండే(46;35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించారు. మరొకవైపు యూసఫ్ పఠాన్(21;15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించడంతో కోల్ కతా గౌరవప్రదమైన స్కోరును సాధించింది. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు సాధించగా, నెహ్రా, రషిద్ ఖాన్, కట్టింగ్లకు తలో వికెట్ లభించింది. ఇది కోల్ కతాకు మూడో విజయం కాగా, వరుసగా రెండో విజయం.