ఇంటికి రాజస్తాన్‌.. ముందుకు కోల్‌కతా | KKR Won By 25 Runs Against Rajasthan Royals | Sakshi
Sakshi News home page

Published Wed, May 23 2018 10:45 PM | Last Updated on Thu, May 24 2018 7:45 AM

KKR Won By 25 Runs Against Rajasthan Royals - Sakshi

ఆనందంలో కేకేఆర్‌ ఆటగాళ్లు

కోల్‌కతా : ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 25 పరుగుల తేడాతో అలవోక విజయం సాధించింది. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌, రస్సెల్‌ రాణించగా.. బౌలర్లందరు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా టాప్‌ ఆర్డర్‌ దారుణంగా విఫలమైంది. కెప్టెన్‌ కార్తీక్‌ 52(38 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్‌లు), రస్సెల్‌ 49(25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), శుబ్‌మన్‌ గిల్‌  28(17 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌)లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేయగలిగింది. రాజస్తాన్‌ బౌలర్లలో గౌతమ్‌, ఆర్చర్‌, లాఫ్లిన్‌లు రెండేసి వికెట్లు తీయగా.. గోపాల్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. పొదుపుగా బౌలింగ్‌ చేసిన కుల్దీప్‌ యాదవ్‌(1/18)కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ వరించింది.

లక్ష్య ఛేదనలో..
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు ఓపెనర్లు రాహుల్‌ త్రిపాఠి, రహానేలు మంచి శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం జోడించిన అనంతరం చావ్లా బౌలింగ్‌ త్రిపాఠి(20: 13 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి  పెవిలియన్‌ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్‌తో రహానే ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. జట్టు స్కోర్‌ 109 పరుగుల వద్ద రహానే 46(41 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) కుల్దీప్‌కు రిటర్న్‌క్యాచ్‌ ఇచ్చి తృటిలో హాఫ్‌సెంచరీ చేజార్చుకున్నాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన క్లాసెన్‌తొ శాంసన్‌ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 37 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్‌లతో శాంసన్‌ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ మరుసటి బంతికే భారీషాట్‌కు ప్రయత్నించి క్యాచ్‌ఔట్‌గా వెనుదిరిగాడు. 

ఒత్తిడిలో చిత్తు..
చేయాల్సిన రన్‌రేట్ పెరగడంతో ఒత్తిడికిలోనైన రాజస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. చివర్లో కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పరుగులు తీయలేక ఇబ్బంది పడ్డారు. దీంతో రాజస్తాన్‌  నిర్ణీత 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. 25 పరుగుల తేడాతో పరాజాయాన్ని చవిచూసింది. కోల్‌కతా బౌలర్లలో చావ్లా రెండు వికెట్లు తీయగా, ప్రసిద్‌ కృష్ణ, కుల్దీప్‌లు తలో వికెట్‌ తీశారు. గెలిచిన కోల్‌కతా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఇదే వేదికగా శుక్రవారం క్వాలిఫైయర్‌-2 ఆడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement